ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తజనం..
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తుండగా.. భక్తులు దండాలు పెడుతూ దర్శనాలు చేసుకుంటున్నారు. బోనాలు, శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలతో మల్లన్న జాతర కన్నుల పండువగా ప్రారంభమైంది. సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఐనవోలు మల్లన్న ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు ఆలయ అధికారులు. 3నెలలపాటు సందడిగా సాగే జాతరకు కరోనాను లెక్క చేయకుండా తొలిరోజు వేలాది […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తుండగా.. భక్తులు దండాలు పెడుతూ దర్శనాలు చేసుకుంటున్నారు. బోనాలు, శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలతో మల్లన్న జాతర కన్నుల పండువగా ప్రారంభమైంది. సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఐనవోలు మల్లన్న ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు ఆలయ అధికారులు.
3నెలలపాటు సందడిగా సాగే జాతరకు కరోనాను లెక్క చేయకుండా తొలిరోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఐనవోలుకు చేరుకున్నారు. మూడు నెలల పాటు జరిగే ఈ ఉత్సవానికి దాదాపు 7లక్షలకు పైగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా పెద్ద బండి రథం..
సంక్రాంతి పర్వదినం సాయంత్రం రోజు.. ఐనవోలు జాతరలో పెద్ద బండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వంశపారంపర్యంగా మార్నేని వంశీయుల ఇంటి నుంచే పెద్ద బండి రథం ప్రారంభమవుతుంది. జాతర మూడో రోజున పెద్ద బండి రథం ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు మంగళహారతులతో రథానికి స్వాగతం పలుకుతూ దారి పొడువునా మొక్కులు చెల్లించుకుంటారు. ఐనవోలులోని మల్లన్న ఆలయం ప్రకృతి రమణీయత, అద్భుత శిల్పసంపదతో సువిశాల ప్రాంగణంలో వందల ఏళ్ల క్రితం నిర్మితమైంది.
ప్రతి ఏడాదీ సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా మల్లన్నకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఈ నెల 14న బండ్లు తిప్పుడు, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 13న ఉగాదితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కరోనా దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. క్యూలైన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేసి… శానిటైజర్, మాస్క్ పంపిణీ చేస్తామని ఈవో తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.