రేపు ఒడిశా, బెంగాల్‌కు ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: యాస్ తుపాను ముంచెత్తిన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించనున్నారు. రెండు రాష్ట్రాలపై తుపాను ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీ అధికారులకు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. తుపానుకు ముందు సన్నాహాలు, రక్షణ కార్యక్రమాలు, అనంతరం నష్టం అంచనాలను […]

Update: 2021-05-27 11:33 GMT

న్యూఢిల్లీ: యాస్ తుపాను ముంచెత్తిన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించనున్నారు. రెండు రాష్ట్రాలపై తుపాను ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీ అధికారులకు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. తుపానుకు ముందు సన్నాహాలు, రక్షణ కార్యక్రమాలు, అనంతరం నష్టం అంచనాలను ప్రధానికి అధికారులు వివరించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం విహంగ వీక్షణం చేపట్టారు. రాష్ట్రంలో తుపానుతో కలిగిన నష్టాన్ని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారమే హింగల్‌గంజ్, సాగర్‌లలో ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలైకుండాలో ఆమె భేటీ కానున్నారు. తుపాను నష్టాన్ని ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్రంలో తుపాను కారణంగా 15వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆమె వివరించారు. ప్రస్తుతం వెయ్యి కోట్ల నిధులతో రక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.

ఒడిశా, బెంగాల్‌ను కుదిపేసిన తర్వాత యాస్ తుపాను గురువారం జార్ఖండ్‌లో బీభత్సం సృష్టించింది. కనీసం 8 లక్షల మంది తుపానుతో ప్రభావితమయ్యారు. రాష్ట్రంలోని కార్‌ఖాయ్, సువర్ణరేఖ సహా పలు నదులు డేంజర్ మార్క్‌ను మించి ప్రవహించాయి. చెట్లు కూలిపోగా, పలుప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో భారీగా వర్షం కురిసే ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేయడంతో సహాయక బృందాలు అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. కనీసం 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు

Tags:    

Similar News