హాట్ టాపిక్‌గా సజ్జనార్ బదిలీ.. ఆ ఘటనే కారణమా?

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆకస్మికంగా ఎందుకు బదిలీ చేసింది? ఊహకు అందని విధంగా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమేంటి? ఆయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను నియమించడానిక నిర్దిష్ట కారణం ఉందా? ఇప్పుడు రాష్ట్ర పోలీసు వర్గాల్లో ఇదే హాట్ హాట్ చర్చగా మారింది. విధి నిర్వహణలో సిన్సియర్‌గా ఉండే సజ్జనార్‌ను బదిలీ చేయడం ఒక ఎత్తయితే ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించడంలో మరో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. […]

Update: 2021-08-26 05:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆకస్మికంగా ఎందుకు బదిలీ చేసింది? ఊహకు అందని విధంగా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమేంటి? ఆయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను నియమించడానిక నిర్దిష్ట కారణం ఉందా? ఇప్పుడు రాష్ట్ర పోలీసు వర్గాల్లో ఇదే హాట్ హాట్ చర్చగా మారింది. విధి నిర్వహణలో సిన్సియర్‌గా ఉండే సజ్జనార్‌ను బదిలీ చేయడం ఒక ఎత్తయితే ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించడంలో మరో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. దిశ సంఘటనలో నిందితులుగా ఉన్న నలుగురు యువకులు ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై సుప్రీంకోర్టులో గతంలో ఒక పిటిషన్ దాఖలైంది.

దీన్ని విచారించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలో పర్యటించి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి రాష్ట్ర హోం కార్యదర్శి నుంచి నివేదికను తీసుకున్నది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా న్యాయవాదులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన సాక్ష్యధారాలతో పాటు అందుకు దారితీసిన కారణాలను వెల్లడించాల్సిందిగా కమిషన్ నిలదీసింది. పోలీసు కస్టడీలో ఉన్న యువకులు ఎన్‌కౌంటర్‌లో ఎలా చనిపోతారంటూ న్యాయవాదులు ఆ విచారణ సందర్భంగా హోం కార్యదర్శిని ప్రశ్నించారు.

మరోవైపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వారు చదువుకున్న విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు తదితరులతో వరుసగా మూడు రోజుల పాటు ఈ కమిషన్ విచారణ జరపనున్నది. గురువారం నుంచి వారి నుంచి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నది. దిశపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనతో ఈ నలుగురు యువకులకు ఎలాంటి ప్రమేయం ఉన్నదనే వివరాలను ఈ మూడు రోజుల పాటు సేకరించనున్నది. వారిపై స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్ళు, ప్రలోభాలు ఎదురవుతున్నాయని న్యాయవాది రజని ఆరోపణలు చేసిన నేపథ్యంలో కమిషన్ నిర్వహించే మూడు రోజుల దర్యాప్తు కీలకంగా మారింది.

ఎంక్వయిరీ కమిషన్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో, సాక్షుల నుంచి, నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిస్తున్న సమయంలోనే ఆ ఎన్‌కౌంటర్‌తో సంబంధం ఉన్న సజ్జనార్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం విశేషం.

Tags:    

Similar News