కొత్త జట్టు‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, ఓల్డ్ ఇజ్ గోల్డ్‌ అంటోన్న ధోని..!

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 నుంచి లీగ్‌లో 10 జట్లు ఉండబోతున్నాయి. ఇటీవలే లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను బీసీసీఐ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. దీంతో 14 ఏళ్ల తర్వాత మరోసారి మెగా ఆక్షన్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నది. పాత 8 జట్లకు నవంబర్ 30 వరకు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇక కొత్తగా వచ్చిన రెండు జట్లకు డిసెంబర్ 1 నుంచి 30 వరకు ‘ఫ్రీ పికప్’కు అవకాశం కల్పించింది. దీంతో […]

Update: 2021-11-25 05:45 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 నుంచి లీగ్‌లో 10 జట్లు ఉండబోతున్నాయి. ఇటీవలే లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను బీసీసీఐ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. దీంతో 14 ఏళ్ల తర్వాత మరోసారి మెగా ఆక్షన్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నది. పాత 8 జట్లకు నవంబర్ 30 వరకు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇక కొత్తగా వచ్చిన రెండు జట్లకు డిసెంబర్ 1 నుంచి 30 వరకు ‘ఫ్రీ పికప్’కు అవకాశం కల్పించింది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్‌పై కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ధోని తన పాత ఫ్రాంచైజీతోనే కొనసాగనుండగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహల్ తన జట్టును వీడి లక్నోకు తరలి వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోబోయే నలుగురిలో ముగ్గురిపై స్పష్టత వచ్చింది. మిగిలిన ఒక స్పాట్ కోసం తీవ్రంగా చర్చోపచర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

కేఎల్ రాహుల్‌తో భారీ డీల్?

ఐపీఎల్‌లో కొత్తగా చేరిన రెండు జట్లలో లక్నో ఒకటి. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ. 7090 కోట్ల భారీ మొత్తానికి లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్నది. ఇంకా పేరు పెట్టని ఈ ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కేఎల్ రాహుల్‌తో ఫ్రాంచైజీ యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. రాహుల్‌కు దాదాపు రూ. 20 కోట్ల వరకు చెల్లించే అవకాశం ఉన్నది. బీసీసీఐ ప్లేయర్ రిటెన్షన్ పాలసీ ప్రకారం ప్రతీ జట్టు నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. అయితే తాము రిటైన్ చేసుకోవాలనుకున్న ప్లేయర్ అంగీకరిస్తేనే రిటెన్షన్ సాధ్యమవుతుంది. ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్నా.. ఆటగాడు అంగీకరించకపోతే ఆ రిటెన్షన్ చెల్లదు. కేఎల్ రాహుల్ ఇప్పటికే పంజాబ్ కింగ్స్‌తో కొనసాగనని స్పష్టం చేశాడు. దీంతో అతడిని పంజాబ్ కింగ్స్ విడుదల చేయడం ఖాయమే. మరోవైపు రెండు కొత్త జట్లలో ఫ్రీ పికప్ ఆప్షన్ లక్నోకే ఉంటుంది. రెండు జట్లలో అత్యధిక ధర పెట్టి కొన్నది లక్నోనే కాబట్టి.. బీసీసీఐ ముందుగా ఆ జట్టుకే అవకాశం ఇచ్చింది. ఈ రెండు నిబంధనల కారణంగా కేఎల్ రాహుల్‌ను లక్నో తమ జట్టులోకి సులభంగానే తీసుకుంటుంది. అయితే నవంబర్ 30న అన్ని జట్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే కొత్త జట్లు తమ ఫ్రీ పికప్ వివరాలను ప్రకటించాల్సి ఉన్నది. డిసెంబర్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీతో పాటు జట్టు పేరును కూడా లక్నో ప్రకటించే అవకాశం ఉంది.

ధోని రిటైర్మెంట్ లేదు..

చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై ఎప్పుడూ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ధోని ఎవరి ఊహలకు అందకుండా తన పని తాను చేసుకొని పోతున్నాడు. తాజాగా ఐపీఎల్ ట్రోఫీ సెలబ్రేషన్స్‌లో మాట్లాడుతూ చెన్నయ్‌లోనే చివరి మ్యాచ్ ఆడతానని చెప్పాడు. అదే సమయంలో ఆ మ్యాచ్ వచ్చే ఏడాది ఉంటుందా లేదా మరో ఐదేళ్ల తర్వాతనా అని చెప్పి సందిగ్దంలో పడేశాడు. తాజాగా చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ధోనిని మరో మూడేళ్ల పాటు రిటైన్ చేసుకోవడానికి సీఎస్కే యాజమాన్యం సిద్ధపడినట్లు తెలుస్తున్నది. ఏ ప్లేయర్‌ను అయినా కనీసం 3 ఏళ్లపాటు రిటైన్ చేసుకోవాలి.. అందుకే ధోనికి ఆ ఆప్షన్ వర్తింపచేయబోతున్నది. ఇక ధోనితో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లను తీసుకోవడం ఖాయంగానే ఉన్నది. అయితే విదేశీ కోటాలో ఎవరిని తీసుకుంటారనే దానిపైనే ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల వివరాలు బయటకు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ వర్మ, జస్ప్రిత్ బుమ్రా, కిరాన్ పొలార్డ్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయమయ్యింది. అయితే ఇంకో స్పాట్‌లో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరికి చోటు దక్కనున్నది.

Tags:    

Similar News