‘ఫార్మర్ ప్రొటెస్ట్’కు మద్దతుగా యూఎస్‌లో టీవీ యాడ్
దిశ, ఫీచర్స్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. ఢిల్లీలో గత రెండు నెలలుగా రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అన్నం పెట్టే రైతులు పోరాటం చేస్తున్న వేళ, ఎంతోమంది దయార్ధ హృదయులు ముందుకొచ్చి వారికి ఆహారం అందిస్తున్నారు. వైద్యులేమో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యపరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు సాయం అందిస్తుండగా, ఇండియన్-అమెరికన్ బ్యాంకర్ రాజ్ సోధి లేనే.. తన స్నేహితులతో కలిసి ‘ఫార్మర్స్ ప్రొటెస్ట్’కు మద్దతు కూడగట్టే […]
దిశ, ఫీచర్స్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. ఢిల్లీలో గత రెండు నెలలుగా రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అన్నం పెట్టే రైతులు పోరాటం చేస్తున్న వేళ, ఎంతోమంది దయార్ధ హృదయులు ముందుకొచ్చి వారికి ఆహారం అందిస్తున్నారు. వైద్యులేమో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యపరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు సాయం అందిస్తుండగా, ఇండియన్-అమెరికన్ బ్యాంకర్ రాజ్ సోధి లేనే.. తన స్నేహితులతో కలిసి ‘ఫార్మర్స్ ప్రొటెస్ట్’కు మద్దతు కూడగట్టే క్రమంలో టీవీలో ఓ ప్రకటన ఇచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్‌కు ముందుగా వచ్చిన ఈ యాడ్ విలువ రూ. 73 లక్షలు కాగా, ఇటీవలే టీవీలో ప్రసారమైన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది.
అమెరికాలో జరిగే ‘సూపర్ బౌల్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ గేమ్ ప్రతి ఏటా ఫిబ్రవరి మొదటి ఆదివారం జరుగుతుండగా, గతేడాది ఈ క్రీడా కార్యక్రమాన్ని 100.45 మిలియన్ల ప్రేక్షకులు చూడటం విశేషం. దీన్నే ‘సూపర్ బాల్ సండే’గా పిలుస్తుంటారు. కాగా ఈ లీగ్ జరిగే సందర్భంలో ఏదైనా యాడ్ ఇస్తే, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశముంటుంది. అందుకే బడాబడా కార్పొరేట్ కంపెనీలు సైతం ఈ సమయంలో యాడ్స్ ఇచ్చేందుకు పోటీపడుతుంటాయి. రాజ్ సోధీ, తన స్నేహితులు కూడా ఇదే టైమ్ ఫాలో అయ్యారు. ‘ఫార్మర్ ప్రొటెస్ట్’ కోసం విరాళాలు అందించాలని కోరుతూ.. 30 సెకన్ల యాడ్‌ను సీబీఎస్ చానల్‌లో ప్రసారం చేశారు. అయితే ఈ ప్రకటన కోసం పది వేల డాలర్లు ($ 10,000) అవసరం కాగా, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘గోఫండ్‌మీ’లో ఒక పేజీని ఏర్పాటు చేయడంతో కేవలం ఒక్క రోజులోనే 11,123 డాలర్లు సమకూరాయి. యాడ్ కోసం ఉపయోగించగా మిగిలిన డబ్బులను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘సేవా ఫర్ ఎవ్రీ’కు విరాళంగా ఇచ్చారు. అయితే ఈ ప్రకటనను స్థానిక కళాకారుడు, తేజీ వీడియోల నిర్మాత షార్ సింగ్ నిర్మించారు.
యునైటెడ్ స్టేట్స్‌లోని 43 ప్రధాన నగరాల్లో ఈ ప్రకటనను ప్రసారం చేయడానికి 852,000 డాలర్లు కలెక్ట్ చేయడం రాజ్ ముందున్న లక్ష్యం కాగా, షార్ తను షూట్ చేసిన యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘మీకు ఆహారం పెట్టే రైతు పోరాడుతున్నాడు. ఇది చాలా మందికి డర్టీగా అనిపించవచ్చు కానీ, రైతుకు మాత్రం ఇది న్యాయమే. రైతు ధనవంతుడు అయితే దేశం కూడా సంపన్నం అవుతుంది’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రసారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతీయ-కెనడియన్ సంగీతకారుడు జాజీ బి వంటి వారితో సహా ఎంతోమంది ఆ వీడియోను షేర్ చేశారు. అమెరికాలోని బ్లాక్ రైట్స్ ఉద్యమంలో అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన మార్టిన్ లూథర్ కింగ్ కోట్ ‘అన్యాయం ఎక్కడైతే రాజ్యమేలుతుందో అక్కడ న్యాయానికి ముప్పు వాటిల్లుతుంది (injustice anywhere is a threat to justice everywhere)’తో ఈ వాణిజ్య ప్రకటన ప్రారంభమవుతుంది. పాప్ ఐకాన్ రిహన్నా వంటి ప్రముఖుల ట్వీట్లు కూడా ఈ ప్రకటనలో కనిపిస్తాయి. ఇది ఫ్రెస్నో మేయర్ జెర్రీ డయ్యర్ సందేశంతో ముగుస్తుంది.
‘వృద్ధ మహిళల ముఖాలను చూసినప్పుడు, వారు నా తాతమ్మ, అమ్మమ్మలా కనిపిస్తున్నారు. పుట్టింట్లో, మెట్టినింట్లో చాలా మంది రైతులున్నారు. మా తాతలు రైతులు కాగా, మా తాత భూమి ఇప్పటికీ పంజాబ్‌లో ఉంది. రైతు ఉద్యమం ఒక్కరికి సంబంధించింది కాదు యావత్ భారతీయ రైతులది. అందుకే రైతులకు మద్దతుగా కాలిఫోర్నియాలో కార్ ర్యాలీలు చేపట్టాం, ఇతర నిరసనలు చేపట్టాం. మేం రూపొందించిన వీడియోకు ప్రతిస్పందన రావడం చాలా సానుకూలంగా ఉంది. చాలామంది రియలైజ్ అవుతున్నారు. తమ వారికి మద్ధతునిస్తున్నారు, తమ మేయర్‌లకు అవగాహన కల్పించే అవకాశం కూడా ఉంది. ఈ చిన్న వీడియో ‘స్నోబాల్’ ఎఫెక్ట్ తీసుకురాగలదని మేము ఆశిస్తున్నాం’అని రాజ్ సోధి అన్నారు.