పద్మక్కా.. ఇదేంది..? పట్టణ ప్రగతి ఇదేనా?
దిశ ప్రతినిధి, మెదక్: పల్లెలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి పేరిట పది రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయినా ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరీ ముఖ్యంగా మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరం. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన నాలుగు రోజులకి కురిసిన వర్షాలకు మెదక్ పట్టణంలోని పలు కాలనీలు […]
దిశ ప్రతినిధి, మెదక్: పల్లెలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి పేరిట పది రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయినా ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరీ ముఖ్యంగా మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరం. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన నాలుగు రోజులకి కురిసిన వర్షాలకు మెదక్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. దీన్ని చూసిన ప్రజలు పద్మక్క. ఇదేంది? అంటూ విమర్శిస్తున్నారు.
వర్షాలకు జలమయమైన కాలనీలు
మెదక్ పట్టణంలో నిన్న, మొన్న కురిసిన వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మెదక్ పట్టణం సాయినగర్ కాలనీలో దుస్థితి ఇదంటూ పలువురు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మురిగి నీటి వ్యవస్థ సరిగ్గా లేక, రోడ్లన్నీ ద్వంసం కావడంతోనే ఈ సమస్య నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
పట్టణ ప్రగతి ఇదేనా?
పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మంచిదే అయినా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యం నీరుగారుతోంది. పది రోజుల పాటు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తూతూ మంత్రంగా పనులు చేయించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే తప్ప ఎక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా ఇది వానాకాలం.. రోడ్లు, మురుగు నీటిని తొలగించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఎవరూ పని చేయలేదు. ఫలితంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని జలమయం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని చూసిన స్థానిక ప్రజలు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై ఇదేనా పట్టణ ప్రగతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరు జల్లులకు ఇంట్లో నుండి రాలేని పరిస్థితి, ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం.. మున్సిపాలిటీకి మాత్రం ట్యాక్సీలు సమయానికి కట్టించుకుంటారు కానీ పనులు మాత్రం చేయరు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.