కాంగ్రెస్‌లో హుజూరా‘వార్’.. రేవంత్ నిర్ణయంపై ఢిల్లీ పెద్దలు సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర పరాజయం ఆ పార్టీలో చిచ్చు రేపింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. చివరకు కమిటీ ఏర్పాటు అనివార్యమంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఢిల్లీదాకా వెళ్లడంతో ఓటమితోపాటు మొత్తం ఎనిమిది అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. అభ్యర్థి […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర పరాజయం ఆ పార్టీలో చిచ్చు రేపింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. చివరకు కమిటీ ఏర్పాటు అనివార్యమంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఢిల్లీదాకా వెళ్లడంతో ఓటమితోపాటు మొత్తం ఎనిమిది అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. అభ్యర్థి ఎంపిక మొదలు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఈసారి తగ్గిన పర్యావసానం, అందుకు దారితీసిన కారణాలు, రాష్ట్ర నాయకత్వం లోపాలు తదితరాలన్నింటినీ నివేదికలో పొందపర్చాల్సిందిగా కోరారు.
తీవ్రమైన గ్రూపు తగాదాలు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో మరింత తీవ్రమయ్యాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు ఓడిపోయారనే అంశంపై కామెంట్లు చేశారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి ఉద్దేశపూర్వకంగానే ఓటమికి కారకులయ్యారంటూ పీసీసీ నేతలపై విమర్శలు వచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలోనే చిచ్చురేపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కోరినట్లుగానే రాష్ట్ర కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తదుపరి చర్చలపై క్లారిటీ రానున్నది. పీసీసీ చీఫ్‌గా హుజూరాబాద్ ఓటమికి తానే బాధ్యత వహిస్తానంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. సమిష్టి బాధ్యతే తప్ప వ్యక్తిగత బాధ్యతలు ఉండవని పలువురు సీనియర్ నేతలు కామెంట్ చేశారు. ఒకరిద్దరు నేరుగా ఏఐసీసీకి లేఖ రాసి హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వైపు నుంచి ఏం జరిగిందో? ఎందుకు కనీసంగా డిపాజిట్ కూడా రాలేదో వారి అభిప్రాయాలను వెల్లడించారు.
8 అంశాలపై నివేదిక
అభ్యర్థి ఎంపిక మొదలు ఓటమి వరకు మొత్తం ఎనిమిది అంశాలపై ఏఐసీసీ నివేదికను కోరింది. బీజేపీతో కుమ్మక్కు వ్యవహారానికి సంబంధించి ఏఐసీసీ సీరియస్‌గానే స్పందించనున్నది. అవసరమైతే పీసీసీ చీఫ్, ప్రచార కమిటీ చైర్మన్ సహా పలువురు సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాల సమాచారం. రాష్ట్ర కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఏఐసీసీ సమీక్ష ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టం కానున్నది. దేశవ్యాప్తంగా పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించినా హుజూరాబాద్‌లో మాత్రం కనీసం డిపాజిట్ కూడా ఎందుకు దక్కించుకోలేదు? ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సంప్రదాయకంగా ఉన్న ఓట్లన్నీ ఎటు పోయాయి? దీనికి కారణమేంటి, అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన లోపాలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసినా ఘోరంగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? లాంటి అంశాలన్నింటిపై ఏఐసీసీ సీరియస్‌గానే ఉన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూ సెకండ్ ప్లేస్‌లో ఉంటే ఈసారి మాత్రం 1.5% ఓట్లతోనే ఎందుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది? జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీతో లోపాయికారీగా అవగాహన కుదిరిందంటూ విమర్శలు రావడానికి కారణమేంటి? అసలేం జరిగింది? లాంటి అంశాలపై ఏఐసీసీ లోతుగానే పోస్టుమార్టం చేయాలనుకుంటున్నది. బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారిని కాకుండా ఓసీ అభ్యర్థిని ఖరారు చేయడాన్ని సీనియర్ నాయకుడు వీహెచ్ బహిరంగంగానే తప్పుపట్టారు. ఈ అంశాలన్నీ ఏఐసీసీ సమీక్షలో ప్రస్తావనకు రానున్నాయి.