ఖాకీల్లో కలకలం.. పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరారీ

సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన జరిగింది. జిల్లాలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఓ దొంగ పరారీ అయ్యాడు.

Update: 2024-07-06 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన జరిగింది. జిల్లాలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఓ దొంగ పరారీ అయ్యాడు. వ్యవసాయ మోటార్ల చోరీ కేసులో అదుపులోకి తీసుకోని విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారీ అయినట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే వారిలో ఒకరు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పరారీ అయిన అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరారీ కావడం జిల్లాలో సంచలనంగా మారింది. ఓవైపు విచారణ జరుపుతుండగా మరో వైపు అనుమానత వ్యక్తి పోలీసులు కళ్లుకప్పి ఎస్కేప్ కావడం ఖాకీలను కలవరానికి గురి చేసింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

రైతుల పైనే రివర్స్ ఎటాక్

కాగా, ఈ ఘటనపై రైతులు సంచలన ఆరోపణలు చేశారు. వారు తెలిపాన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంలోని వెలిదండ, రంగాపురం, సర్వారం తదిరత చుట్టుపక్క గ్రామాల్లో సుమారు 50 వరకు వ్యవసాయ మోటర్లు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. దీంతో ఆయా గ్రామాల రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారని, ఈ క్రమంలోనే ఓ దొంగ పరారీ అయ్యాడని, కానీ పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని రైతులు చెప్పారు. చోరీకి గురైన మోటర్లను ఇప్పించాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కోరామని, కానీ పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారిన రైతులు ఆరోపించారు. మీ మోటర్లకు మీరే కాపలాగా ఉండాలని, రాత్రి సమయాల్లో పొలాల్లోనే పడుకోండని మాట్లాడుతున్నారని, కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కనీయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టుకోని వచ్చిన దొంగ పరారీ అయ్యాడని మేమేం చేయలేమని పోలీసులు చెబుతున్నారని ఆయా గ్రామాల రైతులు సంచలన ఆరోపణలు చేశారు.


Similar News