మత్తులో చిత్తవుతోన్న యువత.. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ''డ్రగ్'' కల్చర్!

బంగారు భవిష్యత్తు ఉన్న యువత మాదకద్రవ్యాల మత్తులో జోగుతోంది. సరదాగా మొదలు పెడుతున్న డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఎంతోమంది ఇళ్లు.. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు.

Update: 2023-02-16 00:30 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బంగారు భవిష్యత్తు ఉన్న యువత మాదకద్రవ్యాల మత్తులో జోగుతోంది. సరదాగా మొదలు పెడుతున్న డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఎంతోమంది ఇళ్లు.. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొందరు నేరాలకు పాల్పడుతూ జైళ్లపాలవుతున్నారు. ఆందోళనాకరమైన విషయమేమిటంటే మాదకద్రవ్యాల మత్తులో కొంతమంది తల్లిదండ్రులు.. తోబుట్టువులను సైతం హత్యలు చేస్తుండటం.

ఈ దందాను అరికట్టటానికి అధికార యంత్రాంగాలు కృషి చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు. కారణం డ్రగ్​నెట్​వర్క్‌లోకి కొత్త కొత్త గ్యాంగులు వస్తుండటమేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం కొరవడటం.. కొంతమంది అధికారులు అవినీతికి మరిగి సహకరిస్తుండటం వల్లనే ఈ దందాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

సముద్ర మార్గాల ద్వారా..

మన దేశంలోకి 70 శాతానికి పైగా మాదకద్రవ్యాలు సముద్ర మార్గాల ద్వారానే వస్తున్నట్టు నార్కొటిక్​కంట్రోల్​బ్యూరో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అరేబియా సముద్రం.. హిందూ మహా సముద్రం తీరాల్లోని పోర్టుల ద్వారా ఈ డ్రగ్స్​వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అరేబియా సముద్రానికి సంబంధించి మన దేశంలో ముంబయి, ముండ్రా, కాండియా, నవ్​షేవా, కొచ్చి, మోర్మూగావ్​పోర్టులు ఉండగా హిందూ మహా సముద్రానికి సంబంధించి పాండిచ్చేరి, కోల్​కతా, చెన్నై, వైజాగ్​ముఖ్య పోర్టులు. ఆఫ్రికన్​దేశాలతో పాటు సౌత్​అమెరికా నుంచి కొకైన్, హెరాయిన్​, ఓపీఎం, ఎండీఎంఏ, హషీష్, గంజాయి​వంటి మాదకద్రవ్యాలు సముద్ర మార్గాల్లో మన దేశానికి చేరుకుంటున్నట్టు అధికారవర్గాల సమాచారం.

దుస్తులు, పుస్తకాలు, చిన్న పిల్లల ఆటసామాగ్రి. కాస్మోటిక్​సామాగ్రి ఇలా పలురకాల వస్తువుల బాక్సుల ద్వారా స్మగ్లర్లు డ్రగ్స్‌ను మన దేశానికి చేరుస్తున్నారు. పట్టుబడకుండా ఉండటానికి పది.. ఇరవై గ్రాముల చొప్పున ప్యాకెట్లలో పెట్టి ఇక్కడికి తరలిస్తున్నారు. కొన్నిసార్లు అఫ్ఘనిస్తాన్, ఇరాన్, శ్రీలంక, మాల్దీవుల దేశాల్లోని పోర్టులకు మాదకద్రవ్యాలను తరలిస్తున్న స్మగ్లర్లు అక్కడి నుంచి మన దేశానికి బోట్ల ద్వరా స్మగుల్​చేస్తున్నారు.

సముద్ర మార్గాల ద్వారా ఎక్కువగా వచ్చే మత్తు పదార్థం హెరాయిన్​అని చెబుతున్న అధికారులు ఆ తరువాతి స్థానంలో కొకైన్, గంజాయి ఉన్నాయని వివరించారు. దీనికి నిదర్శనంగా రెండేళ్ల క్రితం గుజరాత్‌లోని ముండ్రా పోర్టులో డైరెక్టరేట్​ఆఫ్ రెవెన్యూ అండ్​ఇంటెలిజెన్స్​అధికారులు 21వేల కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.

విచారణలో ఈ హెరాయిన్​ఆఫ్ఘనిస్తాన్​నుంచి రవాణా అయి వచ్చినట్టు వెల్లడయ్యిందని చెబుతూ దేశ చరిత్రలోనే ఇదే అతి పెద్ద డ్రగ్​సీజర్​అని అన్నారు. అదే సంవత్సరంలో తమిళనాడులోని ట్యూటీకోరిన్​పోర్టు నుంచి 3‌‌‌‌00 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కొన్నిసార్లు మాదకద్రవ్యాలు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవుల దేశాలకు చేరి అక్కడి నుంచి బోట్ల ద్వారా మన దేశానికి వస్తున్నట్టు వివరించారు. గత ఏడాది శ్రీలంక నుంచి వస్తున్న రెండు బోట్లలో 300, 337 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఉదంతాన్ని గుర్తు చేశారు.

దేశ సరిహద్దుల నుంచి..

ఇక, దేశ సరిహద్దుల నుంచి కూడా భారీగా డ్రగ్స్​మన దేశంలోకి వస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా పాకిస్తాన్, జమ్మూ,కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్​దేశాల సరిహద్దుల్లో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నట్టు తెలిపారు. మన దేశంలోని పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాలు భారత్.. పాక్​సరిహద్దుల్లో ఉన్నట్టు చెప్పారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో నిఘా పెట్టే పరిస్థితి లేదని చెప్పారు. ఇలాంటి చోట్ల నుంచే డ్రగ్స్​స్మగ్లింగ్​గ్యాంగులు మాదకద్రవ్యాలను మన దేశంలోకి చేర వేస్తున్నట్టు వివరించారు.

ఈ గ్యాంగులకు తోడుగా సరహద్దులకు అవతలి వైపు ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా ఈ ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను మన దేశంలోకి పంపిస్తున్నట్టు చెప్పారు. వీరి లక్ష్యం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించటానికి అయ్యే డబ్బు సంపాదించుకోవటంతో పాటు మన దేశ యువత భవిష్యత్తును దెబ్బ కొట్టటమే అని వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం గత ఒక్క సంవత్సరంలోనే సరిహద్దుల నుంచి మన దేశంలోకి 10వేల కిలోలకు పైగా హెరాయిన్​వచ్చిందని తెలుస్తుండటం పరిస్థితికి దర్పణం పడుతుంది.

పార్సిళ్ల ద్వారా కూడా..

గత రెండేళ్లుగా పార్సిళ్ల ద్వారా మాదకద్రవ్యాల స్మగ్లింగ్​ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ప్రయాణీకుల రాకపోకలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే స్మగ్లింగ్​ముఠాలు పార్సిళ్ల ద్వారా ప్రధానంగా గంజాయిని ఎగుమతి, దిగుమతి చేయటం మొదలుపెట్టారు. దీనికి తాజాగా రాచకొండ ఎస్వోటీ​అధికారులు అరెస్టు చేసిన పూణె వాస్తవ్యులు ఫరీద్, ఫైజాన్‌ల ఉదంతాన్ని పేర్కొనవచ్చు.

చెన్నైకు చెందిన రహీం అనే వ్యక్తి నుంచి ఈ ఇద్దరు సూడోఎఫిడ్రీన్​అనే డ్రగ్​కొనేవారు. అనంతరం దానిని 200 గ్రాముల చొప్పున ప్యాకెట్లలో ప్యాక్​చేసి పుస్తకాలు, దుస్తుల మధ్యలో పెట్టి హైదరాబాద్‌లోని జీవీఆర్​ఇంటర్నేషనల్​కొరియర్ప్, పూణెలోని ఇండోఫైన్​కొరియర్​నుంచి ఆస్త్రేలియా, న్యూజీలాండ్​దేశాలకు పంపించేవారు. గత ఒక్క సంవత్సరంలోనే ఇలా నలభై కిలోలకు పైగా డ్రగ్స్‌ను విదేశాలకు తరలించినట్టు విచారణలో వెల్లడించారు.

ఎక్కువగా ఆఫ్రికన్లే పెడ్లర్లు..

ఇలా వేర్వేరు మార్గాల్లో మన దేశానికి చేరుకున్న డ్రగ్స్‌ను స్థానిక గ్యాంగులు వేర్వేరు మెట్రో సిటీల్లో విక్రయాలు చేస్తున్నాయి. ఇలా అమ్ముతున్న వారిలో ఆఫ్రికన్​దేశాలకు చెందిన వారే అధికమని పోలీసు అధికారులు చెబుతున్నారు. వీళ్లు సినీ రంగానికి చెందిన వారితోపాటు బడా వ్యాపారుల పిల్లలు, విద్యార్థులను ఉచ్ఛులోకి లాగుతూ క్రమంగా వారిని మాదకద్రవ్యాలకు అలవాటు చేస్తున్నారు. ఏ మెట్రోపాలిటన్​సిటీలో చూసినా క్లబ్బులు, పబ్బులు, ఫాంహౌస్‌లలో డ్రగ్స్​సేవించేవారు పదుల సంఖ్యలో కనిపిస్తుంటారు. కొందరైతే ఏకంగా రేవ్​పార్టీల పేర ఫాంహౌస్‌లలో ఒక చోట చేరి డ్రగ్స్​సేవిస్తూ చిందులు వేస్తున్నారు.

ఇలా డ్రగ్స్‌కి బానిసలుగా మారుతున్న వారిలో కొందరు యువకులు దారుణమైన నేరాలు చేస్తున్నారు. మత్తు పదార్థాలు కొనటానికి డబ్బు ఇవ్వటం లేదనో.. వాటిని మానిపించేయటానికి ఒత్తిడి తెస్తున్నారనో తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని హత్యలు కూడా చేస్తున్నారు. మరికొందరు దొంగతనాల వంటి నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో సరూర్​నగర్​పోలీస్​స్టేషన్​పరిధిలో ఓ యువకుడు డ్రగ్స్​కొనేందుకు కావాల్సిన డబ్బు కోసం నాయనమ్మను దారుణంగా హత్య చేసి నగలు అపహరించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఢిల్లీలో కేశవ్​అనే యువకుడు తనను రిహాబిలేషన్​సెంటర్‌లో చేర్పించారన్న కోపంతో తల్లిదండ్రులు, సోదరి, నాయనమ్మను కిరాకతంగా హత్య చేసి పోలీసులకు రెడ్​హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇలా చెబుతూపోతే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉదంతాలున్నాయి.

అడ్డుకట్టేది..?

ఆయా రాష్ట్రాల పోలీసులు డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయటానికి ప్రత్యేక విభాగాలను పెట్టి మరీ చర్యలు తీసుకుంటున్నా ఈ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయా రాష్ర్టాల పోలీసు విభాగాల మధ్య సరైన సహకారం లోపించటమే అని అధికారులు విశ్లేషిస్తున్నారు. డ్రగ్స్​కేసులకు సంబంధించిన కేసులు, గ్యాంగులు తదితర వివరాలు ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉన్నా చాలా రాష్ర్టాల పోలీసులు దీనిపై దృష్టి పెట్టటం లేదు. డ్రగ్​పెడ్లర్లకు పూర్తి స్థాయిలో చెక్​పెట్టలేక పోవటానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు.

అయితే, ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ కొందురు అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండటం వల్లనే డ్రగ్స్​దందాకు పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదన్నా ఆరోపణలున్నాయి. ఆయా మెట్రో సిటీల్లోని పబ్బులు, క్లబ్బుల్లో వందలాది మంది బహిరంగంగానే మాదకద్రవ్యాలను సేవిస్తుండటాన్ని దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

Tags:    

Similar News