క్షణికావేశంతో.. రెండు నిండు ప్రాణాలు బలి
కుటుంబ కలహాలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న భార్యను కాపాడబోయి భార్యభర్తలు విగతజీవులైన ఘటన మండల పరిధిలోని నార్సింగ్ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది.
పాపన్నపేట మండలం నార్సింగ్ గ్రామంలో ఘటన
కుటుంబ కలహాలతో భార్యభర్తలు మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు
దిశ, పాపన్నపేట : కుటుంబ కలహాలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న భార్యను కాపాడబోయి భార్యభర్తలు విగతజీవులైన ఘటన మండల పరిధిలోని నార్సింగ్ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ కథనం మేరకు గ్రామానికి చెందిన స్వరూప(32), నగేష్ (35) వ్యవసాయంతో పాటు ఇటీవల నార్సింగ్ శివారులోని శ్రీనివాస్ రెడ్డి ఫాం హౌస్ వద్ద పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంత కాలంగా నగేష్ మద్యానికి బానిసైయ్యాడు.
దీంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి పొలం పనుల నిమిత్తం ఫాం హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వరూప అక్కడే ఉన్న బావిలో దూకేసింది. భార్యను కాపాడే యత్నంలో నగేష్ తన దుస్తులు, సెల్ ఫోన్ ఒడ్డున పడేసి బావిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఊపిరాడక బాడిలోనే మృతి చెందారు. భార్యాభర్తలు చీకటి పడినా.. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వెతికారు. ఫాం హౌస్ బావి వద్ద నగేష్ చెప్పులు, బట్టలు, సెల్ ఫోన్ కనిపించాయి.
చీకటి పడినా ఆచూకీ తెలియకపోవడంతో ఉదయాన్నే ఇద్దరి కోసం గాలిస్తుండగా బావిలో మృతదేహాలు పైకి తేలాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సహాయంతో వారు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నగేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.