ఈ నగరానికి ఏమైంది?
వరంగల్ కమిషనరేట్ పరిధిలో క్రైం రేటు పెరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు షరామాములైపోతున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ కమిషనరేట్ పరిధిలో క్రైం రేటు పెరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు షరామాములైపోతున్నాయి. హత్య ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలైతే..లెక్కేలేదు. నగరంలో గంజాయి బ్యాచుల దాడులతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. అయితే వెలుగులోకి రానివి..పోలీస్ స్టేషన్ వరకు చేరుకోనివి కోకొల్లలుగా ఉంటున్నాయని చెప్పవచ్చు. నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న హత్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఎవరు, ఎందుకు హత్య చేశారో కనుక్కోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారుతోంది. ఆచూకీ చిక్కక కేసులు ఏళ్ల తరబడి అలానే ఉండిపోతున్నాయి. కొన్నిసార్లు మృతులెవరో గుర్తించని పరిస్థితి వస్తోంది. గత కొద్ది నెలలుగా నగరంలో జరుగుతున్న నేరాలను చూస్తున్న జనాలు.. ఈ నగరానికి ఏమైందంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూ, ఆర్థిక వివాదాలు..సుపారీలు..!
భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలు చివరకు హత్యలకు దారి తీస్తున్నాయి. సంవత్సరం కాలంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన హత్యల నేపథ్యం ఈ విధంగానే ఉండటం గమనార్హం. పట్టణీకరణ నేపథ్యంలో జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్‌లో భూముల విలువలు గణనీయంగా పెరగడంతో రోజురోజుకు భూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఆస్తులు, భూ తగదాలతో దాడులు, ప్రతిదాడులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలకు దారి తీస్తున్నాయి. అలాగే వివాహేతర సంబంధాలు, ఆర్థిక లావాదేవీల్లోని వివాదాలు, వివాహేతర సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తుతున్న చిన్నిచిన్న గొడవలు హత్యల వరకు దారి తీస్తున్నాయి.భర్తతో ఉండటం ఇష్టం లేని భార్య మైనర్లకు సుపారీ ఇచ్చి చంపించిన ఘటన కొద్దిరోజుల క్రితం నగరంలో సంచలనం సృష్టించింది.
నగరంలో జరిగిన కొన్ని ఘటనలు
ఈనెల 3న హన్మకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ రాజమోహన్‌ను మంగళవారం తెల్లవారు జామున అత్యంత దారుణంగా తన కారులోనే తాళ్లతో కట్టేసి కత్తులతో పొడిచి దుండగులు చంపిన విషయం తెలిసిందే. మంగళవారం రంగంపేట వద్ద ఓ వ్యక్తి కారును వదిలేసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ హత్య ఎందుకోసం..? ఎవరు చేశారో తెలియాల్సి ఉంది. ఈ ఘటన ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది. హత్యకు గురైన రాజ్‌మోహన్ భార్య మూడేళ్ల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్న అతడికి తెలిసిన వ్యక్తులే పథకం ప్రకారం ట్రాప్ చేసి హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని మహిళ ద్వారా ట్రాప్ చేయించి మద్యం మత్తులో అతడిని హత్య చేసినట్లు ప్రచారం సాగుతోంది. అంతకుముందు అతడి ఒంటిపై ఉండే బంగారు ఆభరణాలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈనెల 3న కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన అలువాల మాల కొండయ్య అనే 70 ఏళ్ల వృద్ధుడిపై మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన మాలకొండయ్య కొడుకుపై పెట్రోల్ ప్యాకెట్లను విసిరడం గమనార్హం. ఇది పక్కగా ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే 30 ఏళ్ల యువకుడు ఈ ఏడాది జులై 20న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక దుండగుడి చేతిని కొరికి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యను తన వద్దకు రాకుండా చేస్తున్నారని కక్ష పెంచుకున్న గీసుకొండ మండలం కొమ్మాలకు చెందిన మేకల నాగరాజు(బన్ని) వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్ తండాలోని బానోతు శ్రీనివాస్ (40) బానోతు సుగుణ(35) దంపతులను దారుణంగా నరికి చంపాడు.
హనుమకొండ జిల్లా పరకాల మండలం కౌకొండలో గ్రామానికి చెందిన మేకల యుగంధర్(35)ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపారు.
గత ఏడాది డిసెంబర్14న కాజీపేటలోని రహమత్ నగర్ కు చెందిన కన్నె విజయ(68)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వడ్డీ వ్యాపారం చేసే ఆమె డబ్బుల విషయంలో ఖరాఖండీగా ఉండేది. డిసెంబర్ 14న రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి సమీపంలో రోడ్డుపై విగతజీవిగా పడి ఉంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు లేకపోవడం గమనార్హం.ఆమె మెడలో ఉండాల్సిన గోల్డ్ చైన్, రెండు చేతి ఉంగరాలు, చెవి కమ్మలు.. ఇలా దాదాపు రూ.లక్షకు పైగా విలువ చేసే నగలు కనిపించలేదు.
రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్బీఐలో దుండగులు సినీ ఫక్కీలో భారీ చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. అలారం, సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి, బ్యాంకు వెనుక కిటికీ గ్రిల్‌ను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులోని 3 లాకర్లలో 1 లాకర్‌ను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచి, సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన రూ.19 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను సైతం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తునకు దాదాపు 19 ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి.