చైల్డ్​ పోర్నోగ్రఫీపై సీఐడీ ‘ఐ’

పెరిగిపోతున్న చైల్డ్​ పోర్నోగ్రఫీ నేరాలపై రాష్ర్ట సీఐడీ సీరియస్​ గా దృష్టిని సారించింది.

Update: 2023-07-25 17:08 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పెరిగిపోతున్న చైల్డ్​ పోర్నోగ్రఫీ నేరాలపై రాష్ర్ట సీఐడీ సీరియస్​ గా దృష్టిని సారించింది. ఈ నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అమెరికాకు చెందిన ఓ ఏజన్సీతో సమన్వయం చేసుకుంటూ సీఐడీ అధికారులు చైల్డ్​ పోర్నోగ్రఫీ నేరాలు చేస్తున్న వారిని ట్రాక్​ చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో 8 కేసుల్లో ఛార్జీషీట్లను దాఖలు చేశారు. మరో 36 కేసుల్లో విచారణను ముమ్మరం చేశారు. చైల్డ్​ పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటుపడిన కొందరు ఆ వీడియోలను సోషల్​మీడియాలోని వేర్వేరు ప్లాట్​ఫాంలలో వైరల్​చేస్తున్నారు. వీటిని చూస్తున్న వారిలో కొందరు తప్పుడు తోవల్లోకి వెళుతుండటంతోపాటు నేరాలకు సైతం పాల్పడుతున్నారు. సీఐడీకి చెందిన ఓ సీనియర్​అధికారి చెప్పిన ప్రకారం ఈ తరహా వీడియోలను ఎక్కువగా సాఫ్ట్​ వేర్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సోషల్​ మీడియా ప్లాట్​ ఫాంలోకి అప్​లోడ్​ చేస్తున్నారు.

జేబులో ఉండే స్మార్ట్​ ఫోన్లతో పాటు ల్యాప్ ట్యాప్లు, కంప్యూటర్లను ఉపయోగిస్తూ వేర్వేరు పోర్న్ సైట్లను సందర్శిస్తున్న వీళ్లు అయిదు నుంచి పదకొండు నిమిషాలపాటు నిడివి ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్​లోడ్​ చేస్తున్నారు. అనంతరం వాటిని వాట్సాప్, టెలీగ్రామ్, ఇన్​స్ గ్రామ్ తదితర గ్రూపుల్లో అప్​లోడ్​ చేస్తున్నారు. ఈ వీడియోలను చూస్తున్న వారిలో కొందరు అనుభవం కోసం వెంపర్లాడుతూ నేరాలకు సైతం పాల్పడుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. దీనికి నిదర్శనంగా కొన్నిరోజుల క్రితం హయత్​ నగర్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనను పేర్కొనవచ్చు. ఓ స్కూల్లో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు నీలిచిత్రాలు చూడటానికి మరిగి తమ తరగతిలోనే చదువుకుంటున్న ఓ మానసిక వికలాంగురాలిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అఘాయిత్యం జరిపారు. దీనిని మొబైల్​ ఫోన్లలో వీడియోలు కూడా తీశారు.

ఆ తరువాత నలుగురిలో ఒకనికి మిగితా వారితో గొడవ కావటం, కోపంతో సదరు విద్యార్థి వీడియోలను వైరల్​ చేయటంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురిని అరెస్టు కూడా చేశారు. కొంతమంది యువకులు ఇలాంటి వీడియోల ప్రభావంతో మైనర్​బాలురు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

నోడల్​ ఏజన్సీగా సీఐడీ

ఇక, చైల్డ్​ పోర్నోగ్రఫీ చెందిన నేరాలను అరికట్టటానికి సీఐడీ నోడల్​ ఏజన్సీగా పని చేస్తోంది. అమెరికాలోని ఓ ఏజన్సీ మన దేశంలోని ఏయే ప్రాంతాల నుంచి ఈ తరహా వీడియోలు అప్​లోడ్ ​అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుంటూ ఆయా రాష్ట్రాల నోడల్​ ఏజన్సీలకు సమాచారాన్ని అందిస్తోంది. ఇటీవల వనస్థలిపురంలో నివాసముంటున్న ఓ విద్యార్థి ఇలాగే వీడియోలను అప్​లోడ్​ చేస్తుండటాన్ని గుర్తించిన సదరు ఏజన్సీ హైదరాబాద్​లోని అమెరికా కాన్సులేట్ సిబ్బంది ద్వారా సీఐడీకి సమాచారం ఇచ్చింది.

ఈ క్రమంలో సీఐడీ పోలీసులు సదరు యువకున్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీనిపై సీఐడీకి చెందిన ఓ అధికారితో మాట్లాడగా పోర్న్ వీడియోలు చూసినా, డౌన్ లోడ్, సర్క్యులేట్​ చేసినా 2000వ సంవత్సరం ఐటీ యాక్ట్​ ప్రకారం నేరమని తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడ్డ వారికి అయిదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. చైల్డ్​ పోర్నోగ్రఫీ కేసుల్లో ఈ సంవత్సరంలోనే ముప్పయి మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

Tags:    

Similar News