భార్యకు హీరోయిన్ రూపం రావడం లేదని భర్త చేసిన దారుణం..

ప్రస్తుత సమాజంలో బ్యూటీకి సంబంధించి ఎన్నో కేర్ సెంటర్లు వచ్చాయి.

Update: 2023-03-03 14:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో బ్యూటీకి సంబంధించి ఎన్నో కేర్ సెంటర్లు వచ్చాయి. ఎంత అసహ్యంగా ఉన్న వారినైనా టెక్నాలజీ ఉపయోగించి అందంగా మార్చేస్తున్నారు. అయినప్పటికీ కొంత మంది అందంగా లేనని, నల్లగా ఉన్నానని, తనను ఎవరు చూడటం లేదని, పెళ్లి చేసుకోరని మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు నల్లగా ఉన్నప్పటికీ ఎక్కువ కట్నం వస్తుందన్న ఆశతో పెళ్లిళ్లు చేసుకుంటారు కొందరు అబ్బాయిలు.

పెళ్లైన కొంత కాలం వారితో సంతోషంగా ఉంటున్నా ఆ తర్వాత వారి అందం గురించి దెప్పి పొడుస్తూ వేధిస్తుంటారు. అదనపు కట్నం తేవాలంటూ టార్చర్ పెడుతూ దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. తన భార్య అందంగా హీరోయిన్‌లా లేదని, అదనపు కట్నం తేవడం లేదని భర్త అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

జేవర్గి తాలుకాలోని కెల్లూరికి చెందిన ఖాజా, ఫర్జానా(28)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే భార్య ఫర్జానా నల్లగా ఉండటంతో పెళ్లి నాటి నుంచి భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ముఖానికి ఎంత పౌడర్ పూసిన హీరోయిన్ రూపం రావడం లేదంటూ తిట్టేవాడు.. అదనపు కట్నం తేవాలని ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలోనే తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. తాజాగా ఇదే విషయంపై భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన ఖాజా.. కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News