ఆంధ్రాలో తెలంగాణ కూలి మృతి.. మరొకరికి పరిస్థితి విషమం..
మిరప పంట ఏరివేత పనులకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు.
దిశ, తుంగతుర్తి : మిరప పంట ఏరివేత పనులకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన యాట సైదమ్మ, ఇరుగు జయమ్మ లతోపాటు మరో 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలో మిరప పంట ఏరడానికి కూలీలుగా వెళ్లారు. అయితే శుక్రవారం రాత్రి వచ్చిన గాలివానతో పాటు పడిన పిడుగులతో సైదమ్మ (42) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె పక్కన ఉన్న ఇరుగు జయమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఈ మేరకు వాళ్లతో వెళ్లిన తోటి కూలీలు సమాచారాన్ని తుంగతుర్తిలోని బాధిత కుటుంబసభ్యులకు చేరవేశారు. జయమ్మను చికిత్స నిమిత్తం సూర్యాపేట అనంతరం హైదరాబాద్ కు తరలించారు. ఇదిలా ఉంటే మృతురాలు సైదమ్మ కుటుంబ పరిస్థితిని చూస్తే దారుణంగా ఉంది. భర్త పక్షవాతంతో ఇంటి పట్టే ఉంటుండగా గత ఏడాది ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందారు. దీంతో కుటుంబ పోషణ సైదమ్మ పై పడింది. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మిరప పంట ఏరడానికి పలువురుతో కలిసి కూలిగా వెళుతోంది. ప్రస్తుతం అలనా పాలనా చూసే భార్య కూడా మృతి చెందడంతో సైదమ్మ భర్త మల్లయ్య పరిస్థితి దారుణంగా మారింది.