పులిచింతల వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు.. తమ్మినేని వీరభద్రం

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Update: 2023-05-27 11:54 GMT

దిశ, హుజూర్ నగర్ : దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం పట్టణంలో జరిగిన సీపీఎం సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల నడుమ తాత్కాలికంగా కమ్యూనిస్టులు కొంతమేర బలహీనపడ్డా చివరికు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేది కమ్యూనిస్టులే అన్నారు.

కమ్యూనిస్టుల పని అయిపోయిందని కొందరు అవాకులు, చవాకులు పేలినప్పటికీ కేవలం ఆ మాటలు ఎక్కడా నిజం కాలేదన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి శాస్త్రీయత ఉన్నదని మానవ మనుగడకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఇటీవల సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశం జరిపి ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించి రానున్న కాలంలో మరిన్ని శుభకర పరిణామాలు జరగనున్నాయని తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసే ఆకస్మికంగా పులిచింతల వెంకటరెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతిఒక్కరు  కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా ఉద్యమాలకు తీరని లోటు..

సీపీఎం సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరనిలోటని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన పులిచింతల వెంకటరెడ్డి అంతిమయాత్రలో వారు పాల్గొని మాట్లాడారు. ఆయకట్టు ప్రాంతంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది అన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతిపిలుపులో ముందు వరుసలో నిలబడి పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ, జిల్లా కమిటీ సభ్యులు నాగారపు పాండు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, పల్లా వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, షేక్ యాకోబ్, డి.రవి నాయక్, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, కౌన్సిలర్ త్రివేణి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సంతాపం..

సీపీఎం సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం స్థానికంగా ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి వెంట జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు పాల్గొన్నారు.

అఖిలపక్ష నాయకుల సంతాపం..

పట్టణానికి చెందిన బీఆర్ఎస్, సీపీఐ, న్యూ డెమోక్రసీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు అఖిల పక్ష నాయకులు శనివారం స్థానికంగా జరిగిన పులిచింతల వెంకటరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సీపీఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, ఎల్లావుల రాములు, కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, వక్కవంతుల కోటేశ్వరరావు, ఎలక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News