స్నేహితుడిని చంపి ఇంట్లోనే పూడ్చేశాడు

స్నేహితుడిని హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చేశాడో వ్యక్తి. అనంతరం నెల రోజులుగా శవంతోనే సహజీవనం చేస్తున్న హంతకుడిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2023-08-01 13:35 GMT

దిశ, కడప: స్నేహితుడిని హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చేశాడో వ్యక్తి. అనంతరం నెల రోజులుగా శవంతోనే సహజీవనం చేస్తున్న హంతకుడిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణం ఈశ్వర్ రెడ్డి నగర్ లో ని ఓ ఇంట్లో గుండెబోయిన సతీష్ కుమార్ (42) ను హత్య చేసి , మట్టిలో పూడ్జి పెట్టిన సంఘటనకు సంబంధించి ఆయన మిత్రుడు ఉట్టే జయకిషోర్ కుమార్ ను అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణా కుమార్ తెలిపారు. ఈ కేసులో 24 గంటలు లోపలే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. మంగళవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరం ఏరియాకు చెందిన గుండే బోయిన సతీష్ కుమార్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈశ్వర్ రెడ్డి నగర్ కు చెందిన ఉట్టే జయకిషోర్ పూల వ్యాపారం చేస్తున్నాడు. వీరు ఇరువురు చిన్ననాటి స్నేహితులు.

గత నెల 15వ తేదీన సతీష్ కుమార్ తన ఇంట్లో గొడవపడి ఇంటి నుండి వెళ్లి పోయాడు. అయితే సోమవారం వన్ టౌన్ ఈశ్వర్ రెడ్డి నగర్ లోని కిషోర్ కుమార్ ఇంట్లో ఒక శవం మట్టి కప్పి ఉంచారన్న సమాచారం రావడంతో వన్ టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ మంజునాథ్ రెడ్డిలు తమ సిబ్బందితో అక్కడికి వెళ్లారన్నారు. సతీష్ కుమార్ కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడ ఉన్న మట్టిని తొలగించగా శవం ఉండటంతో గమనించిన సతీష్ కుటుంబ సభ్యులు ఆ శవం సతీష్ దేనని గుర్తించారని ఏఎస్పీ తెలిపారు. సీఐ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంఘటనా స్థలానికి పిలిపించి సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. సతీష్ శరీరంపై 8 గాయాలను గుర్తించారు. ఈ ఘటనపై సతీష్ భార్య గుండెబోయిన శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో సీఐ రాజారెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉట్టే జయ కిషోర్ కుమార్ ను అరెస్టు చేసి విచారించారు. విచారణలో భాగంగా కిషోర్ కుమార్, సతీష్ కుమార్ లు గత నెల 24వ తేదీన కిషోర్ కుమార్ ఇంట్లో మద్యం సేవించినప్పుడు డబ్బుల విషయమై వారి మధ్య గొడవ జరగింది. కిషోర్ కుమార్ తన వద్ద ఉన్న కత్తితో సతీష్ కుమార్ ను పొడిచి చంపి ఆ శవాన్ని తన ఇంటి వెనుక గదిలో మట్టితో కప్పి దాచినట్లు ఒప్పుకున్నారన్నారు. కిషోర్ కుమార్ నుండి సతీష్ కుమార్ ను చంపేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జులై 11వ తేదీన చనిపోయిన సతీష్ కుమార్ కుమారుడైన ఈశ్వర్ తన తండ్రి కనపడడం లేదని త్రీ టౌన్ వద్దకు వెళ్లారన్నారు. ఆ సమయంలో సీఐ, ఎస్ఐ వేరే మర్డర్ కేసులో బయటకు పోయి ఉన్నారని, కొద్దిసేపు వేచి వుండాలని కోరారన్నారు. అయితే ఈశ్వర్ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండా వెళ్లి పోయారని అడిషనల్ ఎస్పీ తెలిపారు. పై కేసులో 24 గంటలు లోపలే అరెస్టు చేసిన ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్.ఐ మంజునాథ్ , సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అభినందించారు.

Tags:    

Similar News