రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు వైద్యుడు మృతి..

మున్సిపాలిటి పరిధి బంధం పల్లి బస్టాండ్ వద్ద గల రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు వైద్యుడు జక్కుల రామస్వామి (50) అక్కడికక్కడే మృతి చెందాడు.

Update: 2023-06-01 13:47 GMT

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్ : మున్సిపాలిటి పరిధి బంధం పల్లి బస్టాండ్ వద్ద గల రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు వైద్యుడు జక్కుల రామస్వామి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అప్పన్నపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిడుగు సతీష్ కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కి చెందిన ప్రైవేట్ వైద్యుడు జక్కుల రామస్వామి పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రతిరోజు వైద్యం (ప్రాక్టీస్) చేస్తుంటాడు. ఈ క్రమంలో కొత్తపల్లి నుంచి పెద్దపల్లికి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా, బంధంపల్లి బస్టాండ్ వద్ద గోదావరిఖని వైపు నుంచి పెద్దపల్లి కి వస్తున్న ఆటోను దాటుతున్న క్రమంలో బైక్ ఆటో ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది.

దీంతో రోడ్డు పై పడిపోయిన ప్రైవేట్ వైద్యుడు రామస్వామి తలపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రయివేటు వైద్యుడు రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఆటో అదుపుతప్పి పక్కకు వెళ్లి పోగా అదే సమయంలో వెనుక నుండి వచ్చిన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పిడుగు సతీష్ కు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, 108 వాహన సిబ్బందికి సమాచారం అందించి వారి సహాయంతో పెద్దపల్లి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మృతుడు రామస్వామికి భార్య, ముగ్గురు కూతుర్లు కాగా ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశాడు. మరో పెండ్లి ఈడుకి వచ్చిన కూతురు ఉంది. ఈ మేరకు పెద్దపల్లి పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News