చిన్నారిపై పీఈటీ లైంగికదాడి...పోక్సో కేసు నమోదు

కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Update: 2024-09-24 09:51 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీఈటీ నాగరాజు లైంగికదాడి చేశాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీఈటీపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం ఆనోటా ఈనోటా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దాంతో గొడవ పెద్దదిగా మారింది.

    విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను బయటకు పంపడానికి ప్రయత్నించగా విద్యార్థులు భయంతో వణికిపోయారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వర్ రావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు లంచ్​ బాక్సులు తీసుకుని పాఠశాలకు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

    పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ ఫోర్స్ పాఠశాలకు చేరుకుంది. పాఠశాలలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రూంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

సీఐ, ఎస్సైకి గాయాలు

జీవధాన్ పాఠశాలలో ఆందోళనకారులను పోలీసులు ఎంత సముదాయించినా వినిపించుకోలేదు. దాంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో కామారెడ్డి పట్టణ సీఐ తలకు గాయమైంది. సీఐతో పాటు పట్టణ ఎస్సై రాజారాం, లింగంపేట ఎస్సై, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు.

    గాయాలైన పోలీసు సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల లాఠీ ఛార్జీని నిరసిస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ పాఠశాలలో ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో పాఠశాలకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ సిందూశర్మ చేరుకుని పోలీసులతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. అత్యాచారయత్నానికి పాల్పడ్డ పీఈటీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేకున్నా టీచర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించాలని, పాఠశాలలో కో ఎడ్యుకేషన్ కాకుండా వేర్వేరు తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అత్యాచారయత్నానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

    ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు రిమాండ్ కు తరలించామని తెలిపారు. విద్యాసంస్థల్లో సమస్యలపై వందల ఫిర్యాదులు చేసినా డీఈఓ, ఎంఈఓ పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి ఇంత ఆందోళన జరుగుతున్నా డీఈఓ, ఎంఈఓ ఇటువైపు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దాంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన విరమించారు. 

Tags:    

Similar News