కృత్రిమకల్లు కాటుకు ఒకరి బలి..

నిజామాబాద్ నగరంలో కృత్రిమకల్లు కాటుకు ఒకరు బలి అయ్యారు.

Update: 2023-02-09 16:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో కృత్రిమకల్లు కాటుకు ఒకరు బలి అయ్యారు. ఈ సంఘటన బుధవారం రాత్రి నగరంలోని 1వ డిపో కల్లుబట్టిలో జరిగింది. నగరంలోని చంద్రానగర్ కల్లుబట్టిలో కోటగల్లికి చెందిన బండిసాయికుమార్ (40) అనే వ్యక్తి కల్లు తాగి అక్కడే మృతి చెందాడు. నగరంలోని ఖలీల్ వాడిలో ప్రైవేట్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సాయికుమార్ నిత్యం విధినిర్వహణ తర్వాత కల్లుసేవించే అలవాటు ఉంది. బుధవారం రాత్రి సైతం చంద్రనగర్ కల్లుబట్టిలో కల్లుసేవించి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన భార్యపిల్లలు అక్కడికి చేరుకుని అతన్ని తట్టిలేపేందుకు యత్నించగా అతనిలో కదలిక లేకపోవడంతో వారి రోధనలు అందరినీ కలిచివేసాయి. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

నిజామాబాద్ నగరంలో కల్లుబట్టిలలో విక్రయించే కృత్రిమకల్లు తయారి కేంద్రాల్లో తయారి చేసి విక్రయిస్తున్నారు. కల్లులో మత్తు కోసం నిషేదిత అల్పోజోలంతో పాటు ఇతర రసాయానాలు కలుపుతారనేది అందరికీ తెలిసిందే. కానీ కల్లుకు బానిసలు అయిన వారు మద్యం సేవించిన చివరికి మాత్రం కల్లును తప్పనిసరిగా సేవిస్తుంటారు. నిజామాబాద్ కల్లుబట్టిలలో ఒకటి, రెండు డిపోలకు సంబంధించిన సొసైటీలలో తయారు చేసిన కృత్రిమకల్లును విక్రయిస్తుంటారు.

నిత్యం లక్ష లీటర్ల కల్లు ప్యాకెట్లు విక్రయిస్తారనేది బహిరంగ రహస్యమే. ఏడాదిలో చాలా మంది మత్తుకల్లు బాధితులు చనిపోతున్నా ఆబ్కారి శాఖాధికారులు మాత్రం కృత్రిమకల్లు అని మాత్రం రుజువు చేయలేకపోతున్నారు. ఆబ్కారి శాఖలో కానిస్టేబుల్ మొదలుకుని ఉన్నతాధికారి వరకు మామూళ్లు ఇవ్వడం కారణమనే ఆరోపణలున్నాయి. ఆబ్కారితో పాటు కులసంఘాలకు, పోలీసులకు నెలవారి మామూళ్లు అందుతుండడంతో నిత్యం లక్షలాది రూపాయల కృత్రిమకల్లు విక్రయాలు జరుగుతున్నాయి.

బుధవారం రాత్రి చంద్రనగర్ కల్లుబట్టిలో బండిసాయికుమార్ మరణం పై కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు. కల్లుబట్టిలో అతను చనిపోయినట్లు సమాచారం అందడంతో కేసునమోదు చేశామని తెలిపారు. కల్లుబట్టిలో కల్లు సేవించి చనిపోయిన ఉదంతం పై ఆబ్కారి శాఖాధికారులు మాత్రం ఎలాంటి కేసునమోదు చేయలేదు. తమకు ఫిర్యాదు అందలేదని నిజామాబాద్ స్టేషన్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News