ప్రథకం ప్రకారమే హత్య
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ లో ఈ నెల 20న జరిగిన పల్లపు సాయిలు (36) అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నట్లు మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.
దిశ, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ లో ఈ నెల 20న జరిగిన పల్లపు సాయిలు (36) అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నట్లు మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...మృతుని తమ్ముళ్లయిన పల్లపు చందు, పల్లపు చిన్ని, గొల్ల సోమయ్య అనే వారితో మృతుడు పల్లెపు సాయిలుకు గత కొద్ది రోజులుగా భూ వివాదం, ఇంటి స్థలంలో కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరినొకరు కొట్టుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు.
ఐనా కక్ష పెంచుకొని మృతుడు పల్లపు సాయిలు ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసిన గొల్ల సోమయ్య, చందు, చిన్ని స్థానిక గోదావరి బ్రిడ్జి వద్దకు ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. అనంతరం గొడవపడి సాయిలుని నెట్టివేయగా కింద పడిపోయాడు. దాంతో వారి వెంట తెచ్చుకున్న కత్తితో నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుని భార్య నవ్య ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మల్లాపూర్ శివారులోని కనకసోమేశ్వర గుడి వద్ద ఉన్నారనే సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, హత్యకు ఉపయోగించిన తల్వార్ (కత్తి) స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి, మెట్ పల్లి ఎస్ఐ లు చిరంజీవి, రాజు, మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.