అగ్నికి ఆహుతైన మొక్కజొన్నల లోడ్, డీసీఎం
మొక్కజొన్నలు తరలిస్తున్న డీసీఎం లోడ్ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.
దిశ చేగుంట : మొక్కజొన్నలు తరలిస్తున్న డీసీఎం లోడ్ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై మొక్కజొన్నలు తరలిస్తున్న డీసీఎం వాహనానికి మంటలు అంటుకుని వాహనం ఇంజన్ క్యాబిన్ కొంత భాగం, మొక్కజొన్నలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రూ.4 లక్షల మేర నష్టం వాటిలింది. నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గుజ్రాల్ తండా నుంచి ఎనమిది టన్నుల మొక్కజొన్నలను తూప్రాన్ మండలం శభాష్ పల్లి వద్ద గల సుగుణ కోళ్ల దాన పరిశ్రమకు తరలిస్తున్నారు.
మొక్కజొన్నలో తేమశాతం అధికంగా ఉండడంతో సదరు పరిశ్రమ వారు తీసుకోవడానికి తిరస్కరించారు. దీంతో మొక్కజొన్నలను చేగుంట మండలం లో ఉన్న వెంకటేశ్వర హేచరీస్ కు తరలిస్తుండగా మాసాయిపేట వద్దకు రాగానే డీసీఎం ఇంజన్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. గమనించిన డీసీఎం డ్రైవర్ బుచ్చిరాం రాజు నాయక్ రోడ్డు పక్కన ఆపి దూకేశాడు. మాసాయిపేటలో పాదచారులు, దుకాణదారులు గమనించి డీసీఎంపై నీళ్లు చల్లి మంటలను ఆదుపు చేశారు. అప్పటికే ఇంజన్ మొత్తం కాలిపోగా క్యాబిన్ కూడా కాలిపోయింది.