అధిక వడ్డీ ఆశ..వ్యాపారంలో పెట్టుబడి పేరుతో లక్షల్లో మోసం చేసిన మహిళ
అధిక వడ్డీ ఇప్పిస్తానని, వ్యాపారంలో పెట్టుబడులు
దిశ,ఖైరతాబాద్ : అధిక వడ్డీ ఇప్పిస్తానని, వ్యాపారంలో పెట్టుబడులు పేరుతో పలువురి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన మహిళపై చర్యలు తీసుకో వాలని బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..అమరావతి ప్రాంతానికి చెందిన కొడాలి శ్రీలక్ష్మి ఆమె భర్త సత్యప్రసాద్ తో కలిసి వెంకటేశ్వర నగర్ బస్తీలో ఉంటూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పనిచేసింది. ఈ క్రమంలో ఆమె పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు బస్తీలోని ఇతర మహిళలతో పరిచయం పెంచుకుంది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని పద్మ కుమార్తెకు మెడికల్ సీటు వచ్చిందని, సుమారు రూ.2 కోట్ల దాకా ఖర్చవుతుందని నమ్మించింది.
ఆమె ఇంటి యజమానికి డబ్బులు ఇస్తే మళ్లీ అధిక వడ్డీతో సహా ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసింది. అంతేకాకుండా ఆమె కొడుకు ఇంజనీరింగ్ ఫీజు కోసమని, ఆమె భర్త పెట్టబోయే ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి లక్షలాది రూపాయలు అప్పు చేసింది. అయితే ఇటీవల భార్యాభర్తల వ్యవహారం బయటకు రావడంతో బాధితులు శ్రీలక్ష్మిని నిలదీశారు. కొంతమందికి చెక్కులు రాసి ఇచ్చి ఇంటికి తాళం వేసి ఉడాయించింది. ఆమె ఇచ్చిన చెక్కులను బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన సుమారు 20 మంది బాధితులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.