Telugu Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే ప్రాణం తీసింది
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

దిశ, కూకట్పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారిపై కిలో మీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన ఫిన్ని రాజన్(39) గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఫిన్ని రాజన్ చింతల్ కాకతీయ నగర్‌లోని భార్గవ్ ఎంటర్‌ప్రైజెస్‌లో సైట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
తన స్కూటర్‌పై మియాపూర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తుండగా మెట్రో పిల్లర్ నంబర్ 681 వద్ద కరాచీ బేకరీకి ఎదురుగా వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన లారీ రాజన్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు. లారీ డ్రైవర్ రాహుల్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే రాహుల్ కుమార్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం భాల్పూర గ్రామంగా గుర్తించినట్టు కేపీహెచ్‌బీ ఎస్సై మణ్యం తెలిపారు.