స్తంభంపల్లి వద్ద ఘోర ప్రమాదం....ఒకరి పరిస్థితి విషమం
రాష్ట్ర రహదారిపై వెల్గటూరు నుంచి రాయపట్నం మధ్యలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, వెల్గటూర్ : రాష్ట్ర రహదారిపై వెల్గటూరు నుంచి రాయపట్నం మధ్యలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన మరువక ముందే అదే స్తంభంపల్లిలో గురువారం కారు ఆటోను ఢీకొట్టిన మరో ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
లక్షెట్టిపేట వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను స్తంభంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి బలంగా ఢీ కొట్టగా ఆటో బోల్తాపడింది. అందులోని ప్రయాణికులు ఆటో నుంచి రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయి కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఉమాసాగర్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇందారపు కిరణ్, మేడి శ్రీధర్, మేడి సతీష్, గోపతి కిషోర్ లను వెంటనే 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డుపైన పడి ఉన్న ఆటోను తొలగించి రవాణాను పునరుద్దరించారు.