నూతన సంవత్సరం వేళ రైతు కుటుంబంలో విషాదం..
కొత్త సంవత్సరం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
దిశ, శంకరపట్నం : కొత్త సంవత్సరం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన చింతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు బుధవారం ఉదయం తన కుమారునితో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అక్కడే విగత జీవి అయ్యాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వెళ్లి కుమారుడు ఓవైపు తండ్రి ఓవైపు పని చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో చింతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి (53) అక్కడికక్కడే మృతి చెందినట్లు కుమారుడు తెలిపాడు. తాను వచ్చి సీపీఆర్ చేసేలోపే తన తండ్రి తుదిశ్వాస విడిచాడని రోదిస్తూ తెలిపారు. దీంతో గ్రామంలో నూతన సంవత్సరం వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. తనకున్న మామిడి తోటలోనే ఆ రైతు మరణించడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని తల్లిదండ్రుల రోదనలు చూసి పలువురు కంట నీరు పెడుతున్నారు.