నకిలీ వీసా రాకెట్ ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్
నకిలీ వీసా రాకెట్ ముఠాకు చెందిన నలుగురిని రాచకొండ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, మల్కాజిగిరి: నకిలీ వీసా రాకెట్ ముఠాకు చెందిన నలుగురిని రాచకొండ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూఎస్ఏ వీసా, ఐటీఆర్, సహాయక పత్రాలను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి డీసీపీ జానకి వెల్లడించారు. హైదరాబాద్ బొల్లారంకు చెందిన గార్లపాటి వెంకట దుర్గా నాగేశ్వర్ సిద్ధార్థ, అలియాస్ గార్లపాటి వీల్సన్ చౌదరి (38), పాత ఆల్వాల్ కు చెందిన నాదాల ప్రభాకర్ రావు (48), నిజామాబాద్ జిల్లా బుసాపూర్ గ్రామానికి చెందిన జక్కుల నాగేశ్వరరావు (45), బోడుప్పల్ వెంకట్ రెడ్డి కాలనీకి చెందిన గోటుకుల నాగరాజ్ (33) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
వీరి నుంచి ఐదు నకిలీ పాస్ పోర్ట్ లు, 16 ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నకిలీ ఐడీ కార్డులు, నకిలీ ఆహ్వాన పత్రాలు, 23 వీసా నకిలీ రసీదులు, 7 బ్యాంక్ స్టేట్ మెంట్లు, నాలుగు మొబైల్ ఫోన్ లతో పాటు రూ. 18వేల నగదు, కంప్యూటర్, ల్యాప్ టాప్, కలర్ ప్రింటర్, బ్యాంకు ఖాతాలో రూ. 7,02970 నగదును సీజ్చేసి, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీ మురళీధర్, సీఐ సుధాకర్ పాల్గొన్నారు.