బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ED ఎంట్రీ.. సెలబ్రిటీలకు మరిన్ని చిక్కులు తప్పవా?
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్(Betting Apps) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్(Betting Apps) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి సంపాదనే లక్ష్యంగా.. యువతను చెడు దారి పట్టించేలా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన అందరిపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే దాదాపు 11 మందికిపైగా కేసులు నమోదు చేశారు. తాజాగా.. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ(ED) ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్నది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారికి హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్(West Zone DCP Vijay Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కేసు నమోదైన 11 మంది ఇన్ ఫ్లూయన్సర్స్ కారణంగా ఎవరైనా బెట్టింగ్‌లు పెట్టి, వారు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు మా దర్యాప్తులో ఆధారాలు దొరికితే వారిపై కచ్చితంగా పదేళ్ల జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేశారు. చట్టపరంగా ఎవర్నీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. యువతను ఆర్థికంగా నిండా మునిగేలా చేయడం సహించరాని నేరమన్నారు.