మూడు తండాల్లో మృత్యుఘంటికలు..!
బంధువుల విందులో అంతా ఆనందంగా గడిపారు. ఆత్మీయులను కలిసి సంతోషం ను చర్చించుకుంటూ కారులో బయలుదేరారు.
దిశ, మెదక్ ప్రతినిధి/ నర్సాపూర్, వెల్దుర్తి : బంధువుల విందులో అంతా ఆనందంగా గడిపారు. ఆత్మీయులను కలిసి సంతోషం ను చర్చించుకుంటూ కారులో బయలుదేరారు. కొద్ది నిమిషాల్లో ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళే వేళ మృత్యు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వేగంగా వెళుతున్న కారు రెప్ప పాటులో రోడ్డు పై వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టు ను ఢీ కొట్టి వాగులో పడింది. ప్రమాదం ను కారులో ఉన్న వారు గ్రహించే లోపే ఏడుగురు నీటిలో ఊపిరి ఆడక ప్రాణాలు వదిలారు. మృతులంతా రక్త సంబంధీకులే. భార్య, భర్త , తండ్రి కూతురు, తల్లి పిల్లలు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి శివారులో బుధవారం సాయంత్రం జరిగింది.
మెదక్ జిల్లా శివ్వంపేట తాళ్ళపల్లి తండా కు చెందిన ధారావత్ శివరాం, దుర్గి లకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో ఇద్దరు కుమార్తెలు శాంతి, అనితలు. వర్గల్ మండలం సీతారాం తండా లో ఉన్న మరో కుమార్తె ఎల్లమ్మ పండుగ విందుకు ఆహ్వానించారు. దీంతో శివరాం, దుర్గి లతో పాటు అల్లుడు నాసింగ్ కారులో వెళ్ళారు. అక్కడ విందు ముగిసిన వెంటనే అదే కారులో తిరిగి వస్తుండగా సొంత గ్రామాలకు మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకొని కాపాడే ప్రయత్నం చేసినా కారు డొర్లు ఓపెన్ కాకపోవడంతో నీటిలో ఊపిరి ఆడక ముగ్గురు బాలికలు, ముగ్గురు మహిళలతో శివరాం కారులోనే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవింగ్ చేస్తున్న నాంసింగ్ ను మాత్రం స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏడుగురు ఒకే కుటుంబం...
కారు వాగులో పడి మృతి చెందిన విషాద ఘటనలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. ధరావత్ శివరాం అతని భార్య దుర్గి, కుమార్తెలు శాంతి, అనిత లు వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శాంతి బీమ్ల తండాలో భర్త నామ్ సింగ్ తో ఉంటుంది. అనిత జగ్గ్య తండాలో ఉంటుంది. పక్కా పక్కా గ్రామాలు కావడం తో వర్గల్ మండలం సీతారాం తండా లో కుమార్తె చేస్తున్న ఎల్లమ్మ పండగకు నామా సింగ్ కారులో వెళ్ళారు. వారితో పాటు శివ్వంపేట కస్తూర్బా లో పదవ తరగతి చదువుతున్న మమత, 8 వ తరగతి చదువుతున్న బిందు, జగ్గ్య తండా లో ఐదవ తరగతి చదువుతున్న శ్రావణి లను కూడా కారులో తీసుకు వెళ్లారు. ఒకే కారులో కుటుంబం అంతా కలిసి వస్తున్న క్రమంలో ఏడుగురు మృత్యువాత పడడంతో మూడు గ్రామాల్లో విషాదం అలుముకుంది.
దసరా సెలవులకు వచ్చి మృత్యువు ఒడిలోకి..
శివ్వంపేట కస్తూర్బా లో మమత, బిందు చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో ఇద్దరు ఇంటికి వచ్చారు. మంగళవారం నుంచి స్కూళ్ళు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత వెళదామని అనుకున్నారు. ఇంతలో చిన్నమ్మ వద్ద ఎల్లమ్మ పండుగ ఉండడంలో బాబాయ్ కారులో వెళ్లి రావచ్చని భావించి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు కన్నీరు పెట్టారు.
మరో మూడు కిలో మీటర్లు వెళితే గమ్యం...
బంధువుల వద్ద జరిగిన పండగకు వెళ్లిన వారు అక్కడ అందరితో సంతోషంగా గడిపారు. కారులో విందు విషయాలు చర్చించుకుంటూ తిరిగి ఇంటికి వస్తున్న వారి కారు గమ్యానికి మరో మూడు కిలో మీటర్లు వెళితే వచ్చేది. కానీ ఇంతలోనే ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ఏడుగురిని బలి తీసుకుంది.
ప్రమాదానికి అతివేగమే కారణమా..?
కారు వాగులో పడి ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో డ్రైవర్ అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. బంధువుల వద్ద జరిగిన విందు నుంచి తిరిగి వస్తున్న తరుణంలో డ్రైవర్ నామ్ సింగ్ వేగంగా వాహనం నడిపి అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టి వాగులో కారు పడినట్లు తెలిపారు.
తూప్రాన్ ఆసుపత్రి వద్ద బంధువుల రోధనలు
ప్రమాదం అత్యంత బాధాకరం..
డీఎస్పీ తో విచారణ : మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉసిరిక పల్లి వద్ద జరిగిన కారు ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. డ్రైవర్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబం వారని అన్నారు. ప్రమాదం లో గాయాలైన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా అనేది పరీక్ష చేస్తామని చెప్పారు. తూప్రాన్ డిఎస్పీని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
మెదక్ జిల్లా శివంపేట మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారుల తో మాట్లాడి జరిగిన ప్రమాదం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స తో పాటు, అవసరమైన సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.