డేటా చౌర్యొం కేసులో విచారణ ముమ్మరం

డేటా లీకేజీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు.

Update: 2023-04-04 17:01 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: డేటా లీకేజీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. సైబరాబాద్​కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర ఈ కేసు విచారణ కోసం డీసీపీ కల్మేశ్వర్​నేతృత్వంలో సిట్​ను ఏర్పాటు చేశారు. తాజాగా సిట్​అధికారులు 66 కోట్లమందికి పైగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి వేర్వేరు సంస్థలు, వ్యక్తులకు తెగనమ్ముకున్న వినయ్​భరద్వాజ్​ని క్షుణ్నంగా విచారించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అతన్ని కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటీషన్​దాఖలు చేశారు. మరోవైపు నోటీసులు అందుకున్న పదకొండు సంస్థల ప్రతినిధులను 5, 6, 7 తేదీల్లో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని సూచించారు. వీరిని విచారించటానికి నలభై ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేశారు. సైబరాబాద్ పోలీసులు ఇటీవల హర్యానా రాష్ర్టం నొయిడా కేంద్రంగా ప్రజలతోపాటు ఆర్మీ, నేవీ, కీలక ప్రభుత్వ శాఖల ఉద్యోగుల డేటాను సేకరించి అమ్ముకుంటున్న వినయ్​భరద్వాజ్​ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

రక్షణ శాఖ ఉద్యోగులు, డాక్టర్లు, ఆదాయం పన్ను కడుతున్నవారితోపాటు కీలక ప్రభుత్వ శాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని వినయ్​భరద్వాజ్​వేర్వేరు మార్గాల్లో తస్కరించి అమ్ముకుంటున్నట్టుగా వెల్లడైంది. దేశ జనాభాలో సగం మందికి పైగా డేటా వినయ్ భరద్వాజ్​వద్ద దొరకటంతో ఇటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోపాటు అటు ఐటీ శాఖ కూడా ఈ కేసుపై దృష్టిని సారించాయి. కేసు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని సైబరాబాద్​పోలీస్​కమిషనర్​కు సూచించాయి. ఈ క్రమంలోనే వినయ్​భరద్వాజ్​ను మరింత నిశితంగా విచారించాలని నిర్ణయించిన సిట్​అధికారులు అతన్ని కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటీషన్​దాఖలు చేశారు.

తప్పనిసరిగా రావాల్సిందే..

వినయ్​భరద్వాజ్​కు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సంబంధించిన డేటాను ఇచ్చినట్టుగా భావిస్తున్న పదకొండు సంస్థలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఇందులో బిగ్​బాస్కెట్, ఫోన్​పే, ఫేస్​బుక్, క్లబ్​మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్​బ్యాంక్, అస్ట్యూట్​గ్రూప్, మ్యాట్రిక్స్, బ్యాంక్​ఆఫ్​బరోడా, స్టేట్​బ్యాంక్​ఆఫ్​ఇండియా, టెక్​మహీంద్రా సంస్థలు ఉన్నాయి. ఈనెల 5, 6, 7 తేదీల్లో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆయా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సంస్థల ప్రతినిధులను విచారించేందుకు నలభై ప్రశ్నలను సిద్ధం చేసినట్టుగా సమాచారం.

Tags:    

Similar News