కుటుంబంతో కలిసి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్

అప్పుల బాధతో కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-12-29 13:59 GMT

దిశ, సిద్దిపేట అర్బన్ : అప్పుల బాధతో కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బండారి బాలకృష్ణ (36) సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట్ల కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన బాలకృష్ణ రాత్రి 11 గంటల సమయంలో తన భార్య మానసతో ప్రైవేటు కంపెనీలో పెట్టుబడి పెట్టడం కోసం రూ.25 లక్షల అప్పు అయిందని తెలిపాడు. అప్పుల వారు ఇంటి మీదికి వచ్చి గొడవ చేయక ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మంచిదని భార్యకు చెప్పాడు. అనంతరం తన భార్యకు టీ పెట్టమని చెప్పి టీ తెచ్చాక తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందు పౌడర్ ను టీ లో కలిసి భార్యతో పాటు కుమారులు యశ్వంత్, అశ్విత్ లకు ఇచ్చాడు.

అది తాగి అందరూ పడుకోగా తెల్ల వారు జామున 4 గంటల సమయంలో బాలకృష్ణ, మానసకు మెలకువ వచ్చింది. పిల్లలతో సహ ఎవరికీ ఏమీ కాక పోవడంతో బాలకృష్ణ తన భార్య చీరను తీసుకొని పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. గమనించిన అతని భార్య బాలకృష్ణ తమ్ముడు సాయి తో పాటు తన తమ్ముడు శ్రీ శైలం కు ఉరి వేసుకున్న విషయం ఫోన్ ద్వారా తెలుపడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని డోర్ పగలగొట్టి బాడీని కిందకు దించడం తో పాటుగా పోలీసులకు సమాచారం అందించి 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలకృష్ణ అప్పటికే మరణించినట్లు తెలిపారు. బాలకృష్ణ భార్య పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.


Similar News