Mumbai: న్యూఇయర్ వేళ ముంబైలో రూ.89.19 లక్షల జరిమానాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో నూతన సంవత్సరం వేళ (New Year Celebrations) భారీగా ట్రాఫిక్ జాంలు అయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో నూతన సంవత్సరం వేళ (New Year Celebrations) భారీగా ట్రాఫిక్ జాంలు అయ్యాయి. ఒక్క రాత్రిలోనే 17,800 వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు బుధవారం తెల్లవారుజాము వరకూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీగా జరిమానా వసూలు చేశారు. మొత్తం రూ.89.19 లక్షలను జరిమానాల రూపంలో విధించినట్లు వెల్లడించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, సిగ్నళ్లు జంప్ చేయడం, డ్రంకన్ డ్రైవ్ కేసులు వీటిల్లో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసులు ఎన్నంటే?
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా నడిపినందుకు 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మితిమీరిన వేగంతో నడిపినందుకు 842 చలాన్లు, సీటలు బెల్ట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు 432, మద్యం తాగినడిపినందుకు 153, ఫోన్ నడుపుతూ డ్రైవ్ చేసినందుకు 109, ట్రిపుల్ రైడింగ్ కి 123, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్లు విధించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. నగరంలో 8 మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2,184 మంది ఇన్‌స్పెక్టర్లు, 12 వేలకుపైగా కానిస్టేబుళ్లు రోడ్లపై విధులు నిర్వర్తించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక, మద్యంతాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను పెంచేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.