Mumbai Attacks: 26/11 ముంబై దాడుల సూత్రధారిని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు

26/11 ముంబై దాడుల(26/11 Mumbai terror attacks) సూత్రధారి తహవూర్‌ రాణా(Tahawwur Rana)ను దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Update: 2025-01-01 11:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై దాడుల(26/11 Mumbai terror attacks) సూత్రధారి తహవూర్‌ రాణా(Tahawwur Rana)ను దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే అతడ్ని భారత్ అప్పగించేందుకు అమెరికా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతడిని నేరగాళ్ల ఒప్పందం కింద భారత్‌కు అప్పగించవచ్చని ఈ ఏడాది ఆగస్టులో యూఎస్ కోర్టు(US Court) పేర్కొంది. నిందితుడికి వ్యతిరేకంగానూ తగినన్ని సాక్ష్యాలు సమర్పించినట్లు తెలుస్తోంది. రాణా ఈ నేరంలో భాగస్వామి కావచ్చని కోర్టు కూడా అభిప్రాయపడింది. రాణాపై ఇప్పటికే ముంబై పోలీసులు 26/11 దాడులకు సంబంధించి దాదాపు 405 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. పాక్‌ ఐఎస్‌ఐ ఏజెన్సీ, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

అసలు కేసు ఏంటంటే?

పాకిస్థాన్‌ ఉగ్రవాదులు నవంబర్‌ 26, 2008 రాత్రి పాక్‌ నుంచి కొలాబా సముద్రతీరానికి చేరి ముంబైలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వేస్టేషన్‌లోకి చొరబడి ఏకే-47 తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోనూ కాల్పులు జరిపారు. ఇలా వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. ఆ మరణకాడంలో166 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇకపోతే, ముంబై ఉగ్ర కుట్ర మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబై రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై ఉగ్రకుట్ర బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఉగ్ర దాడులు, ఉగ్రకుట్ర కేసుల్లో రాణా, హెడ్లీపై కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత చికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

Tags:    

Similar News