పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఛార్జీషీట్ల దాఖలు
సుధీర్ఘ కాలంగా విచారణలో ఉన్న కేసుల్లో సీఐడీ వరంగల్ రీజనల్ అధికారులు ఆయా కోర్టుల్లో ఛార్జీషీట్లు దాఖలు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సుధీర్ఘ కాలంగా విచారణలో ఉన్న కేసుల్లో సీఐడీ వరంగల్ రీజనల్ అధికారులు ఆయా కోర్టుల్లో ఛార్జీషీట్లు దాఖలు చేశారు. 2010లో ది క్రీసెంట్ ఓవర్ది వరల్డ్ ఈజ్ది బూన్ ఆర్ది సైలెంట్హోలోకాస్ట్ అన్న పేరున ఓ పుస్తకం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంట్లో పవిత్ర ఖురాన్, ప్రాఫెట్ మహ్మద్ పై అభ్యంతరకరంగా ప్రచురితమయ్యాయి. దాంతోపాటు సల్మాన్ రష్డీ రచించిన సాటానిక్వర్సెస్, తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ పుస్తకాల్లో నుంచి కొన్ని వ్యాసాలను తీసుకుని ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇస్లాం ఫాసిజం పేర పుస్తకంలోని 294 నుంచి 298వ పేజీ వరకు ప్రాఫెట్ మహ్మద్ ను నియంత హిట్లర్ తో పోలుస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రచురించారు.
దీనిపై మహ్మద్హసన్ అహమద్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులను కోరాడు. ఈ క్రమంలో సీఐడీ వరంగల్ రీజనల్ అధికారులు పుస్తకాన్ని ఎడిట్ చేసిన ఎం.లక్ష్మయ్య ఎలియాస్ క్రాంతికార్, ఎం.సుబ్బారావు, నరిశెట్టి, ఇన్నయ్య, ఉప్పలపాటి గోపాలకృష్ణ రాజు, డీ.వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కోర్టుకు ఛార్జీషీట్ మాత్రం దాఖలు కాలేదు. ఈ క్రమంలో సీఐడీ ఛీఫ్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు సీఐడీ వరంగల్ రీజనల్ అధికారులు విచారణ పూర్తి చేసి, ఆధారాలను సేకరించి సంబంధిత కోర్టులో తాజాగా ఛార్జీషీట్ చేశారు.
ఎంజీఎంలో జరిగిన ఛీటింగ్ పై..
ఇక వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఛీటింగ్ కేసులో కూడా సీఐడీ సీఐడీ వరంగల్ రీజనల్ అధికారులు కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించారు. హనుమకొండలోని తులసీ ఏజన్సీస్ నుంచి ఎంజీఎం హాస్పిటల్ కు ఆక్సిజన్, నైట్రిక్ ఆక్సయిజన్ సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే 2007 నుంచి 2013వ సంవత్సరం వరకు ఏజన్సీ నిర్వాహకులు ఒక్కో సిలిండర్ కు 180 రూపాయలకు బదులు 380 రూపాయలను కోట్ చేసి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను స్వాహా చేశారు.
ఈ మేరకు ఫిర్యాదు అందగా సీఐడీ అధికారులు ఏజన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్ రెడ్డితోపాటు ఎంజీఎం లో పనిచేసిన డాక్టర్ సి.రఘురాం, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ ఏఎన్ఆర్.లక్ష్మీ, డాక్టర్ బాలభద్ర పార్థుని శ్యామ సుందరరావు, డాక్టర్ తుంగతుర్తి సురేందర్, డాక్టర్ ఎం.సత్యదేవ్, డాక్టర్ సి.నరేంద్రకుమార్, డాక్టర్ బెంజిమాన్ శామ్యూల్, డాక్టర్ కొండూరు నాగేశ్వరరావు, ఆక్టర్ ఉద్దాల లక్ష్మీరాజం, డాక్టర్ పారిపల్లి సాంబశివరావు, డాక్టర్ దుర్గంధం శేషాచారి నర్సింహన్, డాక్టర్ వరికోటి విష్ణుమోహన్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా విచారణ పూర్తి చేసిన సీఐడీ అధికారులు ఆధారాలతో సహా కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించారు.