బోధన్ 231 కోట్ల స్కాంలో సీఐడీ ఛార్జీషీట్
బోధన్ నకిలీ కమర్షియల్ చలాన్ల కేసులో సీఐడీ అధికారులు కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బోధన్ నకిలీ కమర్షియల్ చలాన్ల కేసులో సీఐడీ అధికారులు కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించారు. 231 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన డబ్బు రాకుండా పోయిన ఈ కేసులో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పని చేస్తున్న పలువురు అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ టౌన్ వాస్తవ్యులు, తండ్రీకొడుకులైన సింహాద్రి లక్ష్మీశివరాజ్, సింహాద్రి వెంకట సునీల్‌లు ప్రైవేట్ ట్యాక్స్ ఆడిటర్స్ గా పని చేస్తున్నారు. వీరి వద్ద విశాల్ పటేల్, నారాయణ దాస్ వెంకట కృష్ణమాచారి, సత్యవెంకట కృష్ణకుమార్, మహేశ్, రాకేశ్, రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్నజీరుద్దీన్, అర్రోజుల రాజేశ్వీరి వద్ద ఉద్యోగులు. వీళ్లంతా కలిసి తేలికగా కోట్లాది రూపాయలు సంపాదించటానికి నకిలీ కమర్షియల్ ట్యాక్స్ కుట్రకు తెర లేపారు.
ఈ క్రమంలో నిజామాబాద్ బోదన్ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పని చేస్తున్న రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశయనం వేణుగోపాల స్వామి, హనుమాన్సింగ్, ధరణి శ్రీనివాసరావు, పూర్ణచంద్రారెడ్డి, కిషన్, కే.నాగేశ్వరరావు, కే.విజయకుమార్, రత్నకుమారి, బీ.ఎన్.ఇందిర, జే.రాజయ్య, ఎస్.సాయిలును తమతో కలుపుకొన్నారు. దీంతోపాటు సీ.స్వర్ణలత, కే.అరుణ్‌రెడ్డి, బీ.పీరాజీ, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, బీ.చంద్రహాస్, ఆర్.వినోద్ కుమార్, బీ.రంగారావు, ఎల్.బజరంగ్, సీ.శ్రీధర్లను కూడా కుట్రలో భాగస్వాములుగా చేసుకున్నారు. వీరి సహాయంతో వాస్తవంగా వ్యాట్ చెల్లించిన వారి వివరాలను వీఏటీఐఎస్పోర్టల్లో తారుమారు చేశారు. నకిలీ చలాన్లు సృష్టించి వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయటం ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన 231 కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలకు పైగా డబ్బును కొల్లగొట్టారు. ఈ మేరకు 2017, ఫిబ్రవరి 2న బోదన్సర్కిల్సీటీఓ విజయేందర్పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిజామాబాద్పోలీసులు కేసులు నమోదు చేయగా సీఐడీ అధికారులు దర్యాప్తు బాధ్యతలను తీసుకున్నారు.
ఈ క్రమంలో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో కమర్షియల్టాక్స్విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు 23మంది ఉన్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐడీ ఎకనామికల్అఫెన్సెస్వింగ్శ్యాంప్రసాదరావు నిందితులుగా ఉన్న కమర్షియల్‌టాక్స్ ఉద్యోగులను విచారించటానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుని తాజాగా కరీంనగర్ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్దాఖలు చేశారు. ఐపీసీ 409, 471, 477–ఏ రెడ్‌విత్34, 406, 420, 468, 120బీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్13(1)(ఏ)(బీ) రెడ్‌విత్13(2)ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కేసులో 123మందిని సాక్షులుగా పేర్కొన్నారు. 68 సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్, 143 డాక్యుమెంట్లు, 3 ఆడిట్రిపోర్టులను ఆధారాలుగా న్యాయస్థానానికి సమర్పించారు.