Chain Snatching : చైన్ స్నాచింగ్.. తొమ్మిది రోజుల్లో ఇది రెండో ఘటన

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్స్ మళ్లీ

Update: 2024-10-26 13:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. రోడ్లపై నడిచి వెళ్తున్న వారినే టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ (Chain Snatching) చేసే స్నాచర్లు వారి ట్రెండ్ మార్చుకున్నారనిపిస్తోంది. గతంలో మాదిరిగా రోడ్లపై కాకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులను, మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ లకు తెగబడుతున్నారు. ఇలా చేస్తే వారు తేరుకుని వెంబడించే లోపు పరారయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ఈ ట్రెండును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 న నగరంలోని న్యూఎన్జీవోస్ కాలనీ కి చెందిన సిద్ధిరాములు అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ వృద్ధుడిని కత్తితో బెదిరించి, గాయపరిచి ఆయన మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ఆటోలో పారిపోయాడు. అతనికి ఒక ఆటోవాలా కూడా సహకరించడంతో సాంకేతిక సహకారం తో సీసీ ఫుటేజీలను (CCTV footage) పరిశీలించి దర్యాప్తు జరిపిన పోలీసులు 24 గంటల్లోపే ఈ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

తాజాగా నగరంలోని వినాయక్ నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి దుండగులు పట్టపగలే నిర్భీతిగా గొలుసును లాక్కుని పారిపోయాడు. వృద్ధుడిని కత్తితో బెదిరించి, గాయపరిచి చైన్ లాక్కెళ్లిని ఘటన జరిగిన తొమ్మిది రోజులకు మళ్లీ అదే విధంగా ఈ ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని చైన్ ను ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. ఈ వరుస ఘటనలతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం పూట ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళలు, వృద్ధులు భయం భయం తో గడపాల్సిన పరిస్థితులున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం జరిగిన ఘటన కూడా పట్టపగలు ఆ ప్రాంతంలో ఎక్కువగా జనాల అలికిడి లేని విషయాన్ని గమనించిన దుండగులు మెరుపు వేగంతో వచ్చి గొలుసు దొంగిలించుకుని పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News