హీరో నాగార్జునపై కేసు నమోదు..! మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన భాస్కర్‌ రెడ్డి

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను వివాదాలు చుట్టముడుతున్నాయి.

Update: 2024-10-05 06:08 GMT

దిశ, శేరిలింగంపల్లి: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను వివాదాలు చుట్టముడుతున్నాయి. ఎన్-కన్వెన్షన్ కూల్చివేత నుంచి ప్రారంభమైన పంచాయతీ తాజాగా ఆయనపై కేసు నమోదు వరకు వెళ్లాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడి లాభాలు ఆర్జించారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించినట్లుగా ఆయనకు కాపీ ఇచ్చారు.

శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భాస్కర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 


Similar News