మాచిరెడ్డిపల్లిలో యువకుడి దారుణ హత్య
యువకుడిని దారుణంగా హతమార్చి అందుకు సంబంధించి ఫొటోలను దుండగులు వాట్సప్ లో పోస్ట్ చేసిన ఘటన కోహీర్ మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.
హతమార్చి... వాట్సప్ లో పోస్ట్ చేసిన దుండగులు
హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
దిశ, జహీరాబాద్ : యువకుడిని దారుణంగా హతమార్చి అందుకు సంబంధించి ఫొటోలను దుండగులు వాట్సప్ లో పోస్ట్ చేసిన ఘటన కోహీర్ మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్ పట్టణంలోని ఆర్య నగర్ నివాసముంటున్న అనూష బాయి, అంబాజీలు గంజ్ లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి చిన్న కుమారుడే శ్రీకాంత్. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ ను ఇంట్లోంచి తీసుకెళ్లినట్లు సంబంధీకులు తెలిపారు.
పథకం ప్రకారం దుండగులు శ్రీకాంత్ తో మద్యం తాగించాలనే ఉద్దేశంతో మర్గ మధ్యలో బీర్లు, బిర్యానీ కొనుగోలు చేసి మాచిరెడ్డిపల్లి గ్రామ శివారులో కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులోకి వెళ్లిన శ్రీకాంత్ పై దుండగులు దాడి చేసి, బీరు బాటిల్ పగులగొట్టి గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం హత్యకు సంబంధించి ఫొటోలను వాట్సప్ లో పోస్ట్ చేశారు. సౌమ్యుడు శ్రీకాంత్ కు, అతని కుంటుంబ సభ్యులకు ఎవరితో శత్రుత్వం లేదు. అయినప్పటికీ ఇంతటి దారుణంగా శ్రీకాంత్ హత్యకు గురికావడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు కోహీర్ ఎస్సై సురేష్ కేసు నమోదు చేయగా.. సీఐ తోట భూపతి దర్యాప్తును ప్రారంభించారు. తాజాగా ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పూర్తి దర్యాప్తు అనంతరం హత్యకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తా్మని సీఐ తోట భూపతి తెలిపారు. పోలీసులు అదుపులో ఉన్నవారే శ్రీకాంత్ ను హతమార్చారా.. లేక మరెవరికైనా ఈ హత్యతో సంబంధాలున్నాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.