కోట్ల ఆస్తి.. తిండిపెట్టేవారు లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య

కొడుకుకు కోట్ల ఆస్తి, మనవడేమో ఐఏఎస్ ఆఫీసర్.. కానీ తినడానికి తిండిలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో జరిగింది.

Update: 2023-03-31 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్: కొడుకుకు కోట్ల ఆస్తి, మనవడేమో ఐఏఎస్ ఆఫీసర్.. కానీ తినడానికి తిండిలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రానికి చెందిన జగదీశ్ చంద్ర ఆర్య (78), భగ్లీ దేవీ (77) అనే వృద్ధ దంపతులు.. మొదట్లో తమ చిన్న కుమారుడు మహేంద్ర ఇంట్లో ఉండేవారు. అయితే ఆరేళ్ల కిందట చిన్న కుమారుడు చనిపోయాక కొంత కాలం పాటు చిన్న కోడలు నీలమ్ తో ఉన్నారు. అయితే ఆమె ఇష్టమొచ్చినట్లు తిడుతూ టార్చర్ పెట్టి బయటకు వెళ్లగొట్టింది. ఈ క్రమంలోనే వాళ్లు కొన్ని నెలల పాటు వృద్ధాశ్రమంలో ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత ఆ వృద్ధ దంపతులు చర్కీ దాద్రి జిల్లా బాద్రాలోని శివ కాలనీలోని ఉంటున్న తమ పెద్ద కుమారుడు వీరేంద్ర వద్దకు వచ్చారు. అయితే కొన్ని రోజులు బాగానే చూసుకున్న కొడుకు, కోడలు.. అనంతరం టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ల టార్చర్ భరించలేక ఆ వృద్ధ దంపతులు ఈ నెల 29న పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక అంతకు ముందు తమ చావుకు గల కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాశారు. 

ఇక తమను బాగా చూసుకునే వారు కాదని, చిత్ర హింసలు పెట్టేవారని లేఖలో వాపోయారు. రోజూ పాడైపోయిన ఆహారం పెట్టేవారని తెలిపారు. నిత్యం సూటిపోటీ మాటలతో వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండిలేక ఎన్నో రోజులు పస్తులు ఉన్నామని చెప్పారు. తమ కొడుకుకు రూ.30 కోట్ల ఆస్తి ఉందని, మనవడు ఐఏఎస్ ఆఫీసర్ అని తెలిపారు. అయినా తమను వాళ్లు ఏనాడు బాగా చూసుకోలేదని చెప్పారు. వాళ్ల టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. తమ చావుకు తన పెద్ద కొడుకు వీరేందర్, తమ ఇద్దరు కోడళ్లు కారణమంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక తమ పేరు మీద ఉన్న ఆస్తిని బాద్రాలోని ఆర్య సమాజ్ కు ఇవ్వాలని లేఖలో కోరారు. అలాగే తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేసే కొడుకులు, కోడళ్లను తగిన విధంగా శిక్షించాలని అభ్యర్థించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆత్మహత్యకు పాల్పడ్డ వృద్ధ దంపతుల పెద్ద కుమారుడు వీరేంద్ర మాట్లాడుతూ.. కొంత కాలంగా తమ తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అది తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపాడు.

Tags:    

Similar News