రూ.కోటి విలువైన ఎర్రచందనం సీజ్
పుత్తూరు సబ్ డివిజన్ నారాయణవనం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు కోటి రూపాయలు విలువచేసే 25 ఎర్రచందనం దుంగలు, ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు.
దిశ, తిరుపతి: పుత్తూరు సబ్ డివిజన్ నారాయణవనం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు కోటి రూపాయలు విలువచేసే 25 ఎర్రచందనం దుంగలు, ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. ప్రభుత్వ సంపదని వీటిని దొంగలించడానికి ఎవరు ప్రయత్నించినా, వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని, ఇట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, జిల్లా నుండి బహిష్కరణ చేస్తామని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి గట్టిగా హెచ్చరించారు. తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ డివిజన్ నారాయణవనం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8:30 గంటలకు నారాయణవనం ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా అదే సమయంలో అతివేగంగా పుత్తూరు వైపు నుండి నారాయణవనం వైపు ఒక బొలెరో వాహనం వస్తూ ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాహనాన్ని మరింత వేగం పెంచే ప్రయత్నం చేసి తప్పించుకోవాలని చూశారు. కానీ చివరకి పోలీసులకు చిక్కారు.
ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వాహనంతో పాటు ఒక ముద్దాయిని అరెస్టు చేసి, సుమారు 98 లక్షల విలువచేసే మేలు రకం 25 ఎర్రచందనం దుంగలను, 5 లక్షల విలువచేసే బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక ముద్దాయి పారిపోగా పట్టుబడిన ముద్దాయిని వివరాలు అడగగా తన పేరు మరుదు పాండి వెళ్ళస్వామి (44) తండ్రి వెల్లస్వామి బాల గణేషన్ నగర్, షోలవరం తాలూకా, తిరువల్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం అని తెలిపాడు. పారిపోయిన ముద్దాయి ప్రధాన నిందితుడని ఇతను శేషాచలం అడవిలో ఎర్రచందనం చెట్లను కూలీల సహాయంతో నరికి వాటిని బెంగళూరు, చెన్నై లో గల ప్రధాన స్మగ్లర్లకు అమ్ముతుంటాడని పట్టుబడిన డ్రైవర్ మరుదు పాండి వేళ్ళ స్వామి వెల్లడించాడు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి మంగళవారం రేణిగుంట ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
జిల్లాల్లో అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. తిరుపతి పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధిగాంచినట్టు, మేలురకమైన ఎర్రచందనానికి కూడా శేషాచలం అడవులు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఎర్రచందన స్మగ్లర్లు రకరకాల వ్యూహాలతో అక్రమ రవాణా చేయడానికి వారికి తగిన మార్గంలో వెళుతున్నారని, వీటిని జిల్లా వ్యాప్తంగా అరికట్టడానికి ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా అక్రమ రవాణా అరికట్టడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్మగ్లర్లు ఎంత తెలివిగా ముందుకు వెళ్లినా, పోలీసుల ముందు వారి వ్యూహం కుదరదని, మేము అత్యంత వ్యూహంతో పకడ్బందీగా అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి గట్టి చర్యలు తీసుకున్నామన్నారు.