ప్రభుత్వ ఉన్నతాధికారికి చేదు అనుభవం

‘‘వైద్యారోగ్య విభాగంలో ఒక ఉన్నతాధికారికి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చేరారు. లక్షణాలేవీ లేవు కాబట్టి హోం ఐసొలేషన్‌కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అలా వెళ్లడం ద్వారా మరో సీరియస్ పేషెంట్‌కు బెడ్ ఇచ్చినట్లవుతుందిగదా అని సహృదయంతో ఆలోచించిన ఆ ఉన్నతాధికారి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఎదురైన చేదు అనుభవం తిరిగి ఆయన్ను మళ్లీ ఆసుపత్రికి రప్పించింది.’’ దిశ, న్యూస్ బ్యూరో: ఆయనది […]

Update: 2020-06-24 20:05 GMT

‘‘వైద్యారోగ్య విభాగంలో ఒక ఉన్నతాధికారికి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చేరారు. లక్షణాలేవీ లేవు కాబట్టి హోం ఐసొలేషన్‌కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అలా వెళ్లడం ద్వారా మరో సీరియస్ పేషెంట్‌కు బెడ్ ఇచ్చినట్లవుతుందిగదా అని సహృదయంతో ఆలోచించిన ఆ ఉన్నతాధికారి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఎదురైన చేదు అనుభవం తిరిగి ఆయన్ను మళ్లీ ఆసుపత్రికి రప్పించింది.’’

దిశ, న్యూస్ బ్యూరో: ఆయనది ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్. సొంతంగా కొనుక్కున్నదే. తన ఇంట్లో తాను స్వేచ్ఛగా ఉండొచ్చు. కానీ, కరోనా వాటిని హరించేసింది. హోం ఐసొలేషన్ పేషెంట్ అని జీహెచ్ఎంసీ, పోలీసు, ప్రజారోగ్య శాఖలకు ఈ ఉన్నతాధికారి గురించి సమాచారం వెళ్లిపోయింది. వెంటనే ఇంటికి వచ్చేసి గేటు ముందు ‘ఈ ఇల్లు కరోనా ఐసొలేషన్‌లో ఉంది’ అని జీహెచ్ఎంసీ సిబ్బంది బోర్డు తగిలించేసి వెళ్లిపోయారు. పోలీసులు సైతం ఇంటికొచ్చి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తుల గురించి ఆరా తీశారు. కరోనా పాజిటివ్ పేషెంట్ కావడంతో బ్లూ కలర్‌లో ఉండే పీపీఈ కిట్లు, ఇద్దరు ముగ్గురు వైద్య సిబ్బంది, నానా హంగామా కొద్దిసేపు ఆ వీధిలో విచిత్ర దృశ్యాన్ని ఆవిష్కరించింది. అంతే.. ఇక అక్కడి నుంచి ఆ ఉన్నతాధికారికి కష్టాలు మొదలయ్యాయి. అపార్టుమెంటులోని మిగిలిన పోర్షన్లవారు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ ఒత్తిడి చేశారు. చివరకు ఆయన ఒక్కరోజు కూడా గడవకముందే మళ్లీ ఆసుపత్రికి వెళ్లిపోవాల్సి వచ్చింది. వైద్యారోగ్య శాఖలో ప్రముఖ హోదాలో ఉన్న అధికారికే ఈ అనుభవం ఎదురైతే అద్దె ఇండ్లలో ఉండే చిరుద్యోగులు, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ దినపత్రికలో పనిచేసే ఒక సీనియర్ పాత్రికేయుడికి కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది. అద్దె ఇల్లు కావడంతో నిమిషాల్లోనే బట్టలు సర్దుకుని బేగంపేటలోని ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది.

ఆసుపత్రుల్లో కేవలం ఐదారు శాతం బెడ్‌లు మాత్రమే నిండాయని, మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయని, ఎంత మందికైనా వైద్య చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ బులెటిన్‌లో చెప్తూ ఉంటుంది. లక్షణాలేవీ లేవనే సాకుతూ కరోనా పాజిటివ్ పేషెంట్లను హోం ఐసొలేషన్ పేరుతో డిశ్చార్జి చేస్తూ ఉంది. ఆ తర్వాత వారి గురించి అటు ఆరోగ్య సిబ్బందికీ, ఇటు జీహెచ్ఎంసీ అధికారులకూ పట్టదు. నాలుగు గోడలకే పరిమితమైన హోం ఐసొలేషన్ పేషెంట్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. హోం ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్లను ప్రజారోగ్య శాఖ తరపున ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలి. రెండు రోజులకు ఒకసారి సిబ్బంది వచ్చి పర్యవేక్షించి పోవాలి. ఏవైనా లక్షణాలు బయటపడినా, డాక్టర్ల పర్యవేక్షణ అవసరమైనా పేషెంట్ ఫోన్ చేసిన వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలి. కానీ ఇవేవీ లేవు. వారు ఫోన్ చేసి తెలుసుకోరు. నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో అప్రమత్తతతో పాటు భయం కూడా పెరిగిపోయింది. ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో, ముందుజాగ్రత్తలతో పాజిటివ్ పేషెంట్లను అక్కడి నుంచి తరిమేసే వరకు ఊరుకోవడం లేదు.

కుటుంబ సభ్యులే చిన్నచూపు

గాంధీ ఆసుపత్రిలో 14 రోజుల పాటు చికిత్స చేయించుకున్న60 మందికిపైగా పేషెంట్లను ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఐసొలేషన్ అనంతరం నెగెటివ్ రావడంతో వైద్యులు డిశ్చార్జి చేస్తున్నారు. కానీ, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలోని క్వారంటైన్ వార్డులకు తరలించింది. మృతులను ఖననం చేయడానికి అంబర్‌పేట శ్మశానవాటికలో కూడా వ్యతిరేకత ఎదురైంది. స్థానికులంతా ఇక్కడ పూడ్చిపెట్టడానికి, దహనం చేయడానికి వీల్లేదంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. కొన్నిచోట్ల మృతదేహాన్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు.

అమానవీయంగా ప్రవర్తించొద్దు : మంత్రి ఈటల

అన్ని జబ్బుల్లాగానే కరోనా కూడా ఒకటని, దాని బారిన పడిన వారిని మనుషులుగా కూడా చూడకపోవడం అమానవీయమైన చర్య అని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తోబుట్టువులు, కుటుంబ సభ్యులే చీదరించుకోవడం ఊహించని పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ మా కాలనీ శ్మశానంలో వద్దు.. అంటే మరెక్కడ అంత్యక్రియలు చేయాలని ప్రశ్నించారు.

Tags:    

Similar News