కొవిడ్ వాస్తవ పరిస్థితులపై వలంటీర్ అనుభవాలు
దిశ, ఫీచర్స్: కరోనా తగ్గిపోతోంది, ఇక ఏ ప్రమాదముండదని అందరూ భావిస్తున్న టైమ్‌లోనే మొదలైన సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది. ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతూ జనాలను భయాందోళనల్లోకి నెట్టింది. కాగా ఈ సమయంలో కొవిడ్-19 వలంటీర్‌గా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన జహ్రా అలీ అక్తర్ తన అనుభవాలను వెల్లడించింది. తను స్థానిక మెర్సీ మిషన్‌లో హెల్ప్‌లైన్ వలంటీర్‌గా చేస్తూనే, ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్ సభ్యురాలిగానూ పనిచేస్తోంది. COVID-19 సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సర్వీస్ […]
దిశ, ఫీచర్స్: కరోనా తగ్గిపోతోంది, ఇక ఏ ప్రమాదముండదని అందరూ భావిస్తున్న టైమ్‌లోనే మొదలైన సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది. ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతూ జనాలను భయాందోళనల్లోకి నెట్టింది. కాగా ఈ సమయంలో కొవిడ్-19 వలంటీర్‌గా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన జహ్రా అలీ అక్తర్ తన అనుభవాలను వెల్లడించింది. తను స్థానిక మెర్సీ మిషన్‌లో హెల్ప్‌లైన్ వలంటీర్‌గా చేస్తూనే, ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్ సభ్యురాలిగానూ పనిచేస్తోంది. COVID-19 సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సర్వీస్ అందించే 20 ఎన్జీఓలు ఈ ప్రాజెక్ట్ స్మైల్‌లో భాగంగా ఉన్నాయి. జూన్ 2020 నుంచి స్వచ్ఛంద సేవకురాలిగా ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న జహ్రా.. కొవిడ్ సమయంలో ప్రతిరోజూ తాము స్వీకరించే కాల్స్‌తో పాటు వినియోగదారుల ప్రశ్నలు ఎలా ఉంటాయో స్వయంగా పంచుకుంది.
‘కరోనా తొలి వేవ్ మొదలైన నాటి నుంచి ఆరు నెలల వరకు ఫుడ్, మనీ, ట్రాన్స్‌పోర్టేషన్, ప్లాస్మా దాతలు సహా ఇతరత్రా అవసరాలకు ప్రతీరోజు నిరంతరాయంగా కాల్స్ వస్తుండేవి. అయితే డిసెంబరు నాటికి ఒక్కసారిగా తగ్గిపోయిన కాల్స్.. మార్చి చివరి నాటికి మళ్లీ పెరిగాయి. ఏప్రిల్‌లో మాకు వచ్చిన కాల్స్ ఆధారంగా మరోసారి తీవ్రత ఎక్కువైందనే విషయం అర్థమైంది. కానీ ఈ సారి చాలా మంది ప్రజలు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల గురించి ప్రశ్నిస్తున్నారు. మొదటి వేవ్ మాదిరిగా కాకుండా ఇప్పుడు టీనేజర్లు, వృద్ధుల నుంచి కాల్స్ ఎక్కువగా ఉండగా.. ప్రతీరోజు నాకు వందల సందేశాలతో పాటు సగటున 300-400 కాల్స్ వస్తున్నాయి. ఎంతోమంది కాలర్స్ భయపడుతూ ఫోన్లు చేస్తుంటారు. వారి గొంతులో నిస్సహాయతను గమనించి.. ముందుగా వారిలో ధైర్యాన్ని నింపడంతో పాటు జీవితంపై ఆశ కల్పించడానికి ప్రయత్నిస్తాను. ఇక తమ ఆప్తులను కోల్పోయిన కొంతమంది తమ జీవితాలను కూడా అర్ధాంతరంగా ముగించాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో ముందుగా ఆ ఆలోచన పోయేలా మాట్లాడతాను. మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకతను కాలర్లకు పదే పదే చెబుతాను. కొంతమంది కాలర్స్ అయితే భయం వల్ల సమీప ఆస్పత్రిని కూడా గుర్తించలేకపోతున్నారు.
ఒంటరిగా నివసించే లేదా పిల్లలు విదేశాల్లో ఉన్న సీనియర్ సిటిజన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఓ వృద్ధ దంపతులు రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి, COVID-19 కేంద్రం నుంచి ICU సదుపాయంతో ఆస్పత్రికి మారాలని కోరుకున్నారు. కానీ భర్తకు 87 సంవత్సరాల వయస్సు ఉన్నందున ఆస్పత్రులు అతడి ప్రవేశాన్ని నిరాకరించాయి. ప్రధానంగా యువకుల ప్రాణాలపై దృష్టి పెట్టడానికే మొగ్గుచూపుతారని ఈ సంఘటనతో గ్రహించాను. ఇక్కడ ప్రతీ జీవితం విలువైందే. మనమంతా కరోనావైరస్ వాహకాలమే కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను. మన కారణంగా మన ప్రియమైన వ్యక్తి మరణిస్తే, ఆ భావన మనల్ని జీవితాంతం వేధిస్తుంది. ఇది ఎప్పటికీ సరిచేసుకోలేని తప్పు. స్టే సేఫ్.. స్టే హోమ్.. కొవిడ్ రూల్స్ పాటించండి’ అని జహ్రా అలీ అక్తర్ పేర్కొంది.