బుజ్జగింపులా..? తాయిలాలా.? నేతల రీ ఎంట్రీకి కారణమేంటి?

దిశ ప్రతినిధి, మెదక్: రాజకీయ నేతలు ఎప్పుడు ఏ క్షణంలో ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితులు చూస్తుంటే రాజకీయ పార్టీలు, ఆ నేతలపై క్రింది స్థాయి క్యాడర్ నేతల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. పార్టీల కోసం సొంత ఆస్తులు అమ్ముకుని పార్టీ జండా పట్టుకుని.. పార్టీల సిద్దాంతాల కోసం పనిచేసిన నాయకులను చూశాం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు పార్టీల కోసం పనిచేసే నాయకత్వం నేడు కనపడటం లేదు. కేవలం వ్యక్తిగత లబ్ది, సొంత లాభాలు లేనిదే […]

Update: 2021-07-14 04:55 GMT

దిశ ప్రతినిధి, మెదక్: రాజకీయ నేతలు ఎప్పుడు ఏ క్షణంలో ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితులు చూస్తుంటే రాజకీయ పార్టీలు, ఆ నేతలపై క్రింది స్థాయి క్యాడర్ నేతల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. పార్టీల కోసం సొంత ఆస్తులు అమ్ముకుని పార్టీ జండా పట్టుకుని.. పార్టీల సిద్దాంతాల కోసం పనిచేసిన నాయకులను చూశాం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు పార్టీల కోసం పనిచేసే నాయకత్వం నేడు కనపడటం లేదు. కేవలం వ్యక్తిగత లబ్ది, సొంత లాభాలు లేనిదే ఏ నాయకత్వం, క్యాడర్ పార్టీల జెండాలు, కండువాలు మోయడం లేదు. చొక్కాలు మార్చినట్లు క్షణాల్లో పార్టీలు మారుతూ కండువాలు, జెండాలు మార్చేస్తున్నారు. ఇలాంటి నేతలను చూస్తున్న ప్రజలు ఇదేంటని ముక్కున వేలేసుకుని అవాక్కైపోతున్నారు. పార్టీలు మారుతున్న నేతలను చూసి ఆ పార్టీలనే నమ్ముకుని జెండాలు మోసిన క్రింది స్థాయి నేతలు తమ పరిస్థితి ఏంటని ఏటు తెల్చుకోలేక సతమతమవుతున్నారు.

నిన్న బీజేపీ… నేడు టీఆర్ఎస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంగళవారం రోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ కండువా కప్పుకున్న 24 గంటల్లోనే మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్టీని వీడిన ఆ ముగ్గురు కౌన్సిలర్లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు దుబ్బాక పార్టీ అధ్యక్షుడు ఆసస్వామి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 3 వార్డ్ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, 7వార్డ్ కౌన్సిలర్ దివిటీ కనకయ్య, 8 వార్డ్ దుబ్బాక బాలకృష్ణలను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆ కౌన్సిలర్లను తిరిగి మళ్ళీ 24 గంటల్లోనే టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో కండువా కప్పి స్వాగతం పలికారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ఇద్దరు దివిటి కనకయ్య-7 వార్డ్, డి బాలకృష్ణ-8వ వార్డ్ కౌన్సిలర్లు మంత్రి హరీష్ రావు సమక్షంలో ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరారు.

అయితే నిన్న టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరి నేడు తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక పెద్ద తతంగం నడిచినట్టు ఇతర పార్టీల నేతలు, ప్రజలు చెవులు కోరుక్కుంటున్నారు. అసలు 24 గంటల్లోనే పార్టీలు మారడం వెనుక పెద్దఎత్తున తాయిలాలు మట్టాయా..? లేక బుజ్జగింపులతోనే సమస్య సద్దుమనిగిందా?.? అన్న అనుమానాలకు ప్రధానంగా తాయిలాలే అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. నిన్న పార్టీ మారే సందర్భంలో టీఆర్ఎస్‌ను విమర్శించిన ఆ నేతలు.. తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరే క్రమంలో ప్రగతి ప్రభుత్వంకి జై అంటూ.. అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

హుజురాబాద్ ఎన్నికలే కారణమా..?

హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దుబ్బాకలో పార్టీ మారిన కౌన్సిలర్లను మంత్రి బలవంతంగా తిరిగి సొంత గూటికి చేర్చుకున్నట్టు పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ మారడంతో ..ఈ ఎఫెక్ట్ హుజురాబాద్ గెలుపుపై ప్రభావం చూపుతోందని భావించిన మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నికల ఇంచార్జిగా ఉన్న మంత్రి హరీశ్ రావు అనుక్షణం పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావుపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే ఎవర్ని కలుస్తున్నారు..? అధికార పార్టీ నాయకులెవరు బీజేపీతో టచ్ లో ఉన్నారు..? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారిని పార్టీ మారకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగే వరకు ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉంటారు.. ఎవరు పార్టీ వీడుతారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News