కరోనా సెకండ్ వేవ్..

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగాలు, పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చిందని ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు ప్రకటించేసుకున్నాయి. ఫ్రాన్స్ దేశం బుధవారం నుంచే లాక్‌డౌన్ అమలు చేస్తుండగా జర్మనీ మాత్రం శుక్రవారం నుంచి మొదలుపెట్టింది. నవంబరు 2వ తేదీ నుంచి ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో బార్లు, రెస్టారెంట్లు, వినోదపు పార్కులను మూసివేస్తోంది. తప్పనిసరి అవసరం […]

Update: 2020-10-30 21:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగాలు, పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చిందని ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు ప్రకటించేసుకున్నాయి. ఫ్రాన్స్ దేశం బుధవారం నుంచే లాక్‌డౌన్ అమలు చేస్తుండగా జర్మనీ మాత్రం శుక్రవారం నుంచి మొదలుపెట్టింది. నవంబరు 2వ తేదీ నుంచి ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో బార్లు, రెస్టారెంట్లు, వినోదపు పార్కులను మూసివేస్తోంది. తప్పనిసరి అవసరం ఉంటే మాత్రమే బైటకు వెళ్లాలని, పోలీసులు తనిఖీ చేస్తే ఆ అవసరాలను ధ్రువీకరించేలా తగిన పత్రాలను చూపించాల్సి ఉంటుందని ఆ రెండు దేశాలు పేర్కొన్నాయి. .

మరింత తీవ్రంగా సెకండ్ వేవ్ : ఫ్రాన్స్

మొదటి వేవ్‌ కంటే రెండవది చాలా తీవ్రంగా, విస్తృతంగా, వేగంగా ఉంటుందని అంచనా వేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ టీవీ ద్వారా జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పొరుగు దేశాల తరహాలో ఫ్రాన్స్‌లో కూడా వైరస్ కేసులు పెరుగుతూ ఉన్నాయని, చాలామంది అంచనాలకు కూడా అందడంలేదన్నారు.

మొదటిసారి వచ్చినదానికంటే రెండోసారి వచ్చే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాక్‌డౌన్ విధించాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకోక తప్పడం లేదన్నారు. లాక్‌డౌన్ నిర్ణయంతో ఆ దేశ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాన్స్ దేశంలో సుమారు 14 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా దాదాపు 12 లక్షల కేసులు ఇంకా యాక్టివ్ పాజిటివ్‌గానే ఉన్నాయి. 36 వేల మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు.

సిద్ధంగా లేకుంటే ముప్పు తప్పదు : జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్

అంచనాలకు మించి వేగంగా వైరస్ వ్యాపిస్తున్నందున ఆరోగ్య వ్యవస్థకు తగినట్లుగా సిద్ధం కావాల్సి ఉంటుందని జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ ప్రజలకు వివరించారు. రెండవ వేవ్ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమేనని, స్థానిక ప్రజల ఆరోగ్య శక్తి సామర్థ్యాలకు మించిన స్థాయిలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని నొక్కిచెప్పారు. ముందుగానే తగిన జాగ్రత్తల్లో ఉండడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చునని, లేకుంటే ముప్పు బారిన పడక తప్పదని హెచ్చరించి లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని కోరారు. ఫ్రాన్సులో 36 వేల రోజువారీ కేసులు నమోదవుతున్నాయని, ఆ దేశంతో పోలిస్తే జర్మనీలో కాస్త తక్కువ ఉన్నప్పటికీ త్వరలోనే పెరిగే అవకాశం ఉందన్నారు.

అమెరికాలో మళ్లీ విజృంభణ..

అమెరికాలోని 12 రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ నెలలో ఇప్పటికి మూడు సార్లు రోజుకు వెయ్యి మందికంటే ఎక్కువగా చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే రెండుంబావు లక్షల మందికంటే ఎక్కువే కరోనా కారణంగా చనిపోగా సుమారు 46 వేల మంది ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నట్లు వైట్ హౌజ్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ వ్యాఖ్యానించింది. ఒకే రోజున వెయ్యి మందికి పైగా కరోనాతో చనిపోవడం అక్టోబరు నెలలో మూడవసారి. అక్టోబరు 29న కొత్తగా 94 వేల కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సిట్జర్లాండ్ ఆసుపత్రుల్లో బ్రేకింగ్ పాయింట్ దాటిపోతోందని అప్రమత్తమైన రష్యా ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రష్యాలోని వివిధ ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో 90% బెడ్‌లు నిండిపోయినట్లు ఆ దేశ డిప్యూటీ ప్రధాని టాటియానా గోలికోవా పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలోనే యూరప్‌లో 13 లక్షల కొత్త కేసులు నమోదుకావడాన్ని ఆయన అధికారులతో నొక్కిచెప్పి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి.

థర్డ్ వేవ్ దిశగా ఢిల్లీ?

ఢిల్లీ నగరంలో వారం రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. థర్డ్ వేవ్ అనే భయం ప్రజల్లో నెలకొంది. రెండవ వేవ్ తర్వాతి దశకు వెళ్తున్నాం అని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కేసులు తగ్గాయనుకున్న సమయంలో అక్టోబర్‌లో మళ్లీ పెరుగుతుండడం ముఖ్యమంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెప్టెంబరు 13న గరిష్ట స్థాయిలో 4,473 కేసులు నమోదుకాగా మళ్లీ ఇప్పుడు దాన్ని మించిపోయి 4,853 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3.64 లక్షలు దాటింది. నగరంలో పెరిగిపోతున్న కాలుష్యం, వరుసగా పండుగలు రావడం, శీతాకాలం ఎంటర్ కావడంతో వైరస్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడడం ముప్పుగా పరిణమించనున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు. కానీ వైద్య నిపుణులు మాత్రం థర్డ్ వేవ్‌గా పరిగణించలేమని, స్థానికంగా ఢిల్లీ వాతావరణ పరిస్థితుల్లో కేసులు పెరగడంగా చూడాలని, థర్డ్ వేవ్ అని సాధారణీకరించలేమన్నారు. దీపావళి తర్వాత ఇంకా పెరుగుతాయని సప్దర్‌జంగ్ ఆసుపత్రి కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ జుగల్ కిషోర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఇప్పటికీ ఒకటిన్నర వేయి కేసులు..

తెలంగాణలో కొన్ని గ్రామీణ జిల్లాల్లో వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతీరోజు సగటున 1500కు పైగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. డిశ్చార్జిల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసులు పుట్టుకురావడానికి కారణం వైరస్ వ్యాప్తి ఉండడమేనని, రానున్న మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు.

Tags:    

Similar News