టూరిజం ఢమాల్.. ఆదిలాబాద్‌లో ‘కన్నీటి’ జలపాతాలు

దిశ, బోథ్ : కరోనా మహమ్మారి సగటు జీవి ఆరోగ్యంపైనే కాకుండా జీవనోపాధిపై కూడా దెబ్బ కొట్టింది. ఉత్పత్తి రంగం నుంచి కార్మిక రంగం వరకు అన్నింటిలోనూ కరోనా సృష్టించిన కల్లోలం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఆదాయాన్ని కోల్పోవడం, ఎవరు తమకు సాయం చేస్తారా అని చుట్టూ చూడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఏటా వానా కాలానికి ముందు, వేసవిలో ఉమ్మడి ఆదిలాబాద్ […]

Update: 2021-06-14 09:13 GMT

దిశ, బోథ్ : కరోనా మహమ్మారి సగటు జీవి ఆరోగ్యంపైనే కాకుండా జీవనోపాధిపై కూడా దెబ్బ కొట్టింది. ఉత్పత్తి రంగం నుంచి కార్మిక రంగం వరకు అన్నింటిలోనూ కరోనా సృష్టించిన కల్లోలం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఆదాయాన్ని కోల్పోవడం, ఎవరు తమకు సాయం చేస్తారా అని చుట్టూ చూడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఏటా వానా కాలానికి ముందు, వేసవిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగం ఊపందుకునేది.

జిల్లాలోని బోథ్ నియోజవర్గం పర్యాటకానికి పెట్టింది పేరు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటక ప్రేమికులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి జలపాతాల అందాలు పర్యాటక ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.ముఖ్యంగా నెరడిగొండలోని కుంటాల జలపాతం, బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం, బజార్హత్నుర్‌లోని కానకాయి జలపాతం, ఇచ్చోడలోని గుండాల జలపాతాలకు ప్రతీ ఏటా పర్యాటకులు క్యూ కడుతుంటారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుండి పకృతి ప్రేమికులు ప్రతీ వేసవిలో వచ్చి ఇక్కడ సేద తీరుతుంటారు. కానీ, కరోనా పుణ్యమా అని రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వలన ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో పర్యాటక రంగం కుదేలైంది. ఈ ప్రదేశాల్లో జనాలు కనిపించకపోవడంతో ఇక్కడి ప్రజల జీవనోపాధి సైతం తీవ్రంగా దెబ్బతిన్నది.

చిరు వ్యాపారుల కష్టాలు..

పర్యాటక ప్రాంతాల వద్ద చిరు వ్యాపారులు షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. కరోనా దెబ్బకు జనాలు జలపాతాలను వీక్షించేందుకు రాకపోవడంతో వీరి వ్యాపారం కుదేలైంది. కరోనాకు మందు నార్మల్ రోజుల్లో ఖర్చులన్నీ పోనూ రూ.500 మిగిలేవి. కానీ, ఇప్పుడు కస్టమర్లు లేక దుకాణాలు కూడా ఓపెన్ చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఫూట గడువడం కూడా కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వానా కాలమైనా కలిసొచ్చేనా..

వానా కాలంలో ఉమ్మడి జిల్లాలోని జలపాతాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం వలన నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటర్ ఫాల్స్ పర్యాటకులకు మంచి అనుభూతినిస్తాయి. అయితే, రానున్న రోజుల్లో కరోనా నియంత్రణ కోసం విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఎత్తివేస్తే వ్యాపారుల జీవితాల్లో వెలుగు నిండే అవకాశం ఉంటుంది.

దుకాణం కూడా తీయట్లేదు..

జలపాతాల అందాలను చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తుండే వారు. పనిలో పనిగా మా షాప్‌లో వారికి కావాల్సినవి కొనుగోలు చేస్తుండే వారు. దీంతో తమకు గిరాకీ అవుతుండే. కరోనా వలన జనాల సంఖ్య తగ్గడంతో దుకాణం కూడా తియడం లేదు.

-రాము(జలపాతం వద్ద షాప్ నిర్వాహకుడు)

ఆదేశాలు వస్తే అనుమతిస్తాం..

కరోనా మహమ్మారి ప్రభావం వలన జలపాతాల వద్దకు ప్రజలను అనుమతించడం లేదు. పై అధికారుల నుంచి ఆదేశాలు వస్తే సందర్శకులను అనుమతిస్తాం. ప్రస్తుతమైతే జలపాతాల వద్దకు ఎవ్వరినీ అనుమతించడం లేదు.

-సత్యనారాయణ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బోథ్)

Tags:    

Similar News