కరోనా మళ్లీ మొదలుపెట్టింది.. జాగ్రత్త వహించండి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే భరోసాతో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ గతేడాది ఇదే నెలలో ప్రారంభమైంది. 2020 మార్చి 23న జనతా కర్ఫ్యూ అనంతరం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేసింది. పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజులుగా […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే భరోసాతో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ గతేడాది ఇదే నెలలో ప్రారంభమైంది. 2020 మార్చి 23న జనతా కర్ఫ్యూ అనంతరం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేసింది. పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పదుల సంఖ్యలో వైరస్‌బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
జాగ్రత్తలే శరణ్యం..
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు పాటించడమే శరణ్యమని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, వేసవి ఎండలు పెరిగినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే వైరస్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. శానిటైజర్, సోషల్ డిస్టెన్స్, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, అవసరమైతేనా బయటకు రావాలని సూచిస్తున్నారు.
3లక్షలు దాటిన కేసులు..
శనివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 3,02,724 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 2,98 , 451 మంది కోలుకోగా 1,666 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,607 ఉండగా వీరిలో 980 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 95,48,685 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,036 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కొవిడ్ బారిన పడి మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 75 కేసులు నమోదయ్యాయి.