చారిత్రాత్మక ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్ కనుమరుగు

దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని చారిత్రాత్మక ఫారెస్ట్ గ్రౌండ్ గురించి ఆ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఉత్తమ క్రీడాకారులు ఆ గ్రౌండ్‌లోనే తయారయ్యారు. ఈ ఫారెస్ట్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన క్రీడాకారులు పోలీస్ శాఖలో, ఆర్మీలో, రైల్వేలో, సినీ రంగంలో ఉన్నతమైన స్థానాల్లో రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంతోమంది పోలీసులను, భారత జవాన్లను ఈ గ్రౌండ్ అందించింది. ఇంతటి చరిత్ర కలిగిన ఫారెస్ట్ గ్రౌండ్‌ను అటవీ శాఖ అధికారులు కోర్టుకు అప్పజెప్పడంపై స్థానిక […]

Update: 2021-07-10 05:16 GMT

దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని చారిత్రాత్మక ఫారెస్ట్ గ్రౌండ్ గురించి ఆ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఉత్తమ క్రీడాకారులు ఆ గ్రౌండ్‌లోనే తయారయ్యారు. ఈ ఫారెస్ట్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన క్రీడాకారులు పోలీస్ శాఖలో, ఆర్మీలో, రైల్వేలో, సినీ రంగంలో ఉన్నతమైన స్థానాల్లో రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంతోమంది పోలీసులను, భారత జవాన్లను ఈ గ్రౌండ్ అందించింది. ఇంతటి చరిత్ర కలిగిన ఫారెస్ట్ గ్రౌండ్‌ను అటవీ శాఖ అధికారులు కోర్టుకు అప్పజెప్పడంపై స్థానిక క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీశాఖ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన పాఠశాలగా ఇల్లందుకు చారిత్రాత్మక గుర్తింపు ఉంది. దాదాపుగా 70 ఏళ్లకు పైగా ఫారెస్ట్ ఉద్యోగుల శిక్షణ కేంద్రంగా ఇల్లందు నెలవైంది. ఉద్యోగం పొందిన అధికారులు సైతం ట్రైనింగ్ నిమిత్తం ఇల్లందు ఫారెస్ట్ స్కూల్లో శిక్షణ తీసుకొని వ్యాయామం నిమిత్తం ఫారెస్ట్ గ్రౌండ్‌లో శిక్షణ తీసుకునేవారు.

అలా ప్రతి సంవత్సరం 9 నెలలు ట్రైనింగ్ పొందడానికి ప్రతి బ్యాచ్ వస్తూ.. పోతూ.. ఉండేది. అప్పుడు ఇల్లందు పట్టణం 1500 మంది ఫారెస్ట్ అధికారులతో ఎంతో కళకళలాడేది. ఎంతోమందికి ఫారెస్ట్ స్కూల్ జీవనోపాధిని కల్పించింది. ఇలా ఎంతోమంది ఫారెస్ట్ అధికారులను తయారు చేసింది. అనంతర కాలంలో 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం ఇల్లందు ట్రైనింగ్ స్కూల్‌ను హైదరాబాద్‌లోని దూలపల్లికి మార్చింది. దీంతో ఇల్లందు పట్టణంలో ఫారెస్ట్ ట్రైనింగ్ స్కూ‌ల్‌కు అడ్డుకట్ట పడింది. అప్పటినుండి ఫారెస్ట్ గ్రౌండ్‌ను ఇల్లందు పట్టణంలోని క్రీడాకారులు, వాకర్స్ ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అంతేగాకుండా.. ఫారెస్ట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం లేనందున ఈ మైదానంలో దసరా ఉత్సవాలు సైతం అట్టహాసంగా జరుపుతారు.

ఫారెస్ట్ అధికారుల నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

చారిత్రాత్మక ఫారెస్ట్ గ్రౌండ్‌ను అటవీశాఖ అధికారులు కోర్టు భవన నిర్మాణం కోసం కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పలువురు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయశాఖకు సంబంధించిన స్థలాలు ఉన్నప్పటికీ నూతన భవనాలకు స్థలం సరిపోదన్న ఉద్దేశంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. పట్టణ ప్రజలకు, క్రీడాకారులకు ఉపయోగపడే క్రీడా మైదానాన్ని ఆ శాఖకు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు అప్పజెప్పడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలం కేటాయింపుపై పునరాలోచించాలని వినతి పత్రం సైతం అందజేశారు. ఫారెస్ట్ గ్రౌండ్ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పజెప్పాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇల్లందు పట్టణంలో చారిత్రాత్మకమైన క్రీడా మైదానం భవిష్యత్తులో కనుమరుగవుతుందని ప్రజలు, క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News