కథ మారని ‘కాంగ్రెస్’
దేశ రాజకీయాలను తనవైపునకు తిప్పుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’ విజయం దాదాపు ఖయామైపోయింది. 2015 నాటి ఫలితాలే పునరావృత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఖాతా తెరవని ‘కాంగ్రెస్’ ఈసారి అదే రికార్డును భద్రపర్చుకోనుంది. 1998-2013 వరకు పదిహేనేండ్లపాటు ఢిల్లీలో అధికారాన్ని శాసించిన కాంగ్రెస్ ‘ఆప్’ రాకతో కనీసం ఖాతా తెరవని స్థాయికి పడిపోవడం గమనార్హం. 125 ఏండ్లకు పైగా […]
దేశ రాజకీయాలను తనవైపునకు తిప్పుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’ విజయం దాదాపు ఖయామైపోయింది. 2015 నాటి ఫలితాలే పునరావృత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఖాతా తెరవని ‘కాంగ్రెస్’ ఈసారి అదే రికార్డును భద్రపర్చుకోనుంది. 1998-2013 వరకు పదిహేనేండ్లపాటు ఢిల్లీలో అధికారాన్ని శాసించిన కాంగ్రెస్ ‘ఆప్’ రాకతో కనీసం ఖాతా తెరవని స్థాయికి పడిపోవడం గమనార్హం. 125 ఏండ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి రావడం ఆ పార్టీ అభిమానులను, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై అలుముకున్న అసమ్మతి, ప్రధాని అభ్యర్థిగా మోడీ నాయకత్వాన్ని బలపరిచే ప్రచారాలు ఊపందుకోవడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదు. అదీగాక అవినీతి రహిత బిల్లుపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసితో ఉద్యమాలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ స్థాపించి, ఇది సామాన్యుడి పార్టీ అంటూ చేసిన ప్రచారం ఢిల్లీ ప్రజలను ఆకట్టుకుంది. బీజేపీ 31 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. ఆప్ (28), కాంగ్రెస్ (08)లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత ‘కాంగ్రెస్ ఓటు బ్యాంకు’ క్రమంగా ఆప్ వైపునకు మళ్లింది. ఢిల్లీ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించడంలో ఆప్ విజయవంతం కావడమే ఇందుకు కారణం.
ఇక 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ‘బీజేపీ, ఆప్’ మధ్యే పోటీ నడిచింది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం ‘యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసినవారిలా’ సాగింది. షాహీన్‌బాగ్ నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలతో బీజీపీ నాయకత్వం, అభివృద్ధి మంత్రంతో కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకెళ్లగా కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో తడబడటం స్పష్టంగా తెలిసింది. కొందరు కాంగ్రెస్ అభ్యర్థులైతే ఫలితాలను ముందే ఊహించి పోటీ చేసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఏదేమైనా జాతీయ స్థాయి పార్టీ, ఢిల్లీలో హ్యాట్రిక్ నమోదు చేసిన పార్టీ రెండు దఫాలు ఖాతా తెరవకపోవడమనేది నాయకత్వ లోపమా, స్వయంకృతాపరాధమా, కాలానికి తగ్గట్టు తన విధానాలు మార్చుకోకపోవడమా.. అనే విషయాలను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు.