రాములమ్మ కాంగ్రెస్‌ను వీడితే నష్టమా ? లాభమా !

దిశ, వెబ్‌డెస్క్: ఇల్లు ఇజారం, పొయ్యి బుదారంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫైర్ బ్రాండ్, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తిరిగి సొంతగూటికి చేరబోతున్నారన్న వార్తలకు సోమవారం మరింత బలం చేకూరడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి. ఇదేక్రమంలో అటు పార్టీ బలోపేతానికి పర్సనల్‌గా ఇమేజ్‌ ఉన్న నేతలను చేర్చుకుంటున్న బీజేపీ ప్రజెంట్ ఫుల్ […]

Update: 2020-11-23 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇల్లు ఇజారం, పొయ్యి బుదారంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫైర్ బ్రాండ్, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తిరిగి సొంతగూటికి చేరబోతున్నారన్న వార్తలకు సోమవారం మరింత బలం చేకూరడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి. ఇదేక్రమంలో అటు పార్టీ బలోపేతానికి పర్సనల్‌గా ఇమేజ్‌ ఉన్న నేతలను చేర్చుకుంటున్న బీజేపీ ప్రజెంట్ ఫుల్ జోష్‌‌లో ఉండగా.. విజయశాంతి పార్టీ మారే విషయమై రాజకీయవర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నికలకు ముందు కేసీఆర్‌తో విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటినుంచే హస్తంపార్టీకి అంటిముట్టనట్లుగా ఉన్న రాములమ్మ గాంధీభవన్‌ గడప తొక్కడం లేదన్న విమర్శలు వినిపించాయి. మళ్లీ 2018 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో బోనం ఎత్తుకొని కేసీఆర్‌పై విమర్శలు చేసేసరికి విజయశాంతి క్రీయాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ ఎప్పట్లేగే పార్టీకి ఆమడదూరం ఉండటంతో, ఈలోపు రాష్ట్రంలో బీజేపీ యాక్టివ్‌గా మారి.. విజయశాంతిని తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి.

ఇక.. రాములమ్మ పార్టీ వీడుతారని పక్కాగా తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిలో ఉండగా, కొందరు నేతలు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. 2009లో తెలంగాణ ఉద్యమ వేవ్, మహాకూటమి అభ్యర్థి కావడం వల్లే గెలిచిందని, ఆమెకు సినిమా ఇమేజ్ తప్ప రాజకీయ అవగాహన శూన్యమని చెప్పుకొస్తున్నారు. కేవలం వ్యక్తిగత రాజకీయ జీవితం కోసమే పార్టీ వీడుతున్నారని, ఆమె వెళ్లినా కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం ఉండదని, ఇంతకుముందు ఇలాంటి ఒడిదొడుకులను పార్టీ చాలా చూసిందని స్పష్టం చేస్తున్నారు. పార్టీలో చేరగానే 2014ఎన్నికల్లో సోనియా గాంధీ దయతో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పిస్తే ఓడిపోయారని, అప్పుడు కష్టాల్లో ఆదుకున్న పార్టీని.. ఇప్పుడు స్వలాభం కోసం వీడినా ఎలాంటి భవిష్యత్‌ ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులతో పాటు, మెదక్ జిల్లా నియోజకవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషిచేస్తున్న బీజేపీకి.. ఇటీవలికాలంలో చేరిన కొంతమంది నేతలే తప్ప, గ్రౌండ్‌ లేవల్‌లో అంతగా కార్యకర్తలు లేరన్నది విశ్లేషకుల మాట. అయినా ఇప్పటికిప్పుడు విజయశాంతి బీజేపీలో చేరితే మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రంలో పార్టీకి మరింత బలం పెరుగుతుందనుకోవడం కూడా అత్యాశే అవుతుందని పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి డీకే అరుణ లాంటి నేతలు బీజేపీలో చేరినా.. మహబూబ్‌నగర్‌తో పాటు, రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం కనపడటం లేదని, ఇప్పుడు విజయశాంతి చేరినా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని అభిప్రాయపడుతున్నారు. విజయశాంతి కాషాయ కండువా కప్పుకుంటే రాష్ట్రంలో లేదా జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవులు ఇస్తారేమో గానీ, ఏకంగా రాజ్యసభ లాంటి పదవులు ఇచ్చి పెద్దలసభకు పంపే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఒకవేళ 2023ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయని, అంతేతప్ప రాములమ్మ బీజేపీలో చేరితే ఇప్పటికిప్పుడు పార్టీకి ఎలాంటి లాభం ఉండదని, అటూ కాంగ్రెస్‌కు సైతం ఎలాంటి నష్టం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News