CREDAI: గృహ రుణాల వడ్డీపై ప్రభుత్వాన్ని 100 శాతం మినహాయింపు కోరిన క్రెడాయ్

సరసమైన గృహాల నిర్వచనాన్ని సవరించాలని, పరిమితిని రూ.45 లక్షల నుంచి కనీసం రూ.75-80 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది.

Update: 2024-11-25 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సరసమైన, మధ్యస్థ ఆదాయ గృహాలకు డిమాండ్‌ను పెంచేందుకు ఆదాయపు పన్ను చట్టం కింద గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై 100 శాతం మినహాయింపు ఇవ్వాలని రియల్టర్ల అపెక్స్ బాడీ క్రెడాయ్ ప్రభుత్వాన్ని కోరింది. దానివల్ల స్థిరాస్తి పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుంది. క్రెడాయ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేసింది. అందులో భాగంగానే సరసమైన గృహాల నిర్వచనాన్ని సవరించాలని, పరిమితిని రూ.45 లక్షల నుంచి కనీసం రూ.75-80 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే, ఇళ్ల డిమాండ్ పెంచేందుకు ప్రస్తుతం నిర్మాణంలో రూ. 45 లక్షల విలువైన ఇళ్లపై 1 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఆపైన నిర్మాణంలో ఉన్న రూ. 75-80 లక్షల ఇళ్లపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. దీన్ని సవరించి రూ. 75-80 లక్షల ఇళ్లపై 1 శాతం మాత్రమే జీఎస్టీ అమలు చేయాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ కోరారు. సరసమైన ఇళ్ల నిర్వచనాన్ని సవరించడం, జీఎస్టీ తగ్గింపు వల్ల ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయి. అదే విధంగా ఐటీ చట్టం రూ. 2 లక్షల వరకు గృహరుణాల వడ్డీపై మినహాయింపు ఉందని, దీన్ని 100 శాతానికి పెంచాలన్నారు. ఇక, నిర్మాణాలకు సంబంధించి అనుమతులకు ఎక్కువ సమయం పడుతోందని, దీన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. 

Tags:    

Similar News