Maruti Suzuki: 30 లక్షల వాహనాల ఎగుమతుల మైలురాయిని సాధించిన మారుతీ సుజుకి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కంపెనీ 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కీలక మైలురాయిని సాధించింది. భారత్ నుంచి 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసి కొత్త రికార్డులను అధిగమించినట్టు కంపెనీ సోమవారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కంపెనీ 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది గతేడాది కంటే 17.4 శాతం ఎక్కువ కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఎగుమతులు మెరుగ్గా ఉన్నాయి. మారుతీ సుజుకి ప్రస్తుతం అంతర్జాతీయంగా దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. అందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు కీలకమైన మార్కెట్లుగా ఉన్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని వాహనాల్లో 40 శాతం మారుతీ సుజుకీ కార్లే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో నాణ్యత, భద్రత, డిజైన్, టెక్నాలజీ ద్వారా కొత్త కస్టమర్లకు చేరువ అవుతున్నామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టేకుచి అన్నారు.